గుంటూరులో హైడ్రామా.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్ట్‌ | YSRCP Lella Appireddy Arrest At Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో హైడ్రామా.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్ట్‌

Nov 6 2026 7:30 AM | Updated on Nov 6 2026 8:37 AM

YSRCP Lella Appireddy Arrest At Guntur

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే క్రమంలో ఎన్నికల సిబ్బంది వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ బాక్సులను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ నల్లపాడు సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో గుంటూరు పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వెంగళాయపాలెంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నల్లపాడు సెంటర్ వద్ద ఒక అధికారి బ్యాలెట్ బాక్స్‌ను వాహనం నుంచి దించి పక్కకు తీసుకెళ్లారు. ఆ బ్యాలెట్ బాక్స్‌ను టీడీపీ నాయకుల వద్దకు తీసుకెళ్లి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు అధికారిని అడ్డుకుని బ్యాలెట్ బాక్స్‌ను తమ సమక్షంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.

నల్లపాడు సెంటర్‌లో రాస్తారోకో
బ్యాలెట్ బాక్స్ తరలింపు వ్యవహారంపై నిరసనగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లపాడు సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. బ్యాలెట్ బాక్స్‌ను తమకు చూపించాలని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నల్లపాడు సెంటర్‌కు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు.

 

ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్
నల్లపాడు సెంటర్‌లో ఆందోళన కొనసాగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను కొనసాగించడంతో పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. అనంతరం, వివాదానికి కారణమైన బ్యాలెట్ బాక్స్‌ను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో నల్లపాడు సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై కేసు నమోదు
ఈ ఘటనకు సంబంధించి ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బ్యాలెట్ బాక్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారనే అభియోగాలతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు మార్చినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి లేళ్ల అప్పిరెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. నేడు అప్పిరెడ్డిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: పరాకాష్టకు ‘పచ్చ’ అరాచకం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement