పల్లెల్లోనూ మున్సిపల్ ఎన్నికల ఫార్ములా
కాలేజీ పిల్లలు, గంజాయి, రౌడీ మూకలతో యథేచ్ఛగా దొంగ ఓట్లు
సిరా చెరిపి మళ్లీ క్యూలోకి.. ఒక్కడే పదిసార్లు
ముందు ఏజెంట్ అరెస్ట్.. తర్వాత కెమెరా బంద్
చనిపోయిన వారికి ఓటు.. బతికున్నవారికి మాత్రం లేదు
దొంగ ఓటర్లకు సవ్యంగా ఖాకీల కాపలా
ధైర్యం చేసి దొంగలను పట్టించినా కేసు పెట్టని పోలీసులు
ప్రజాస్వామ్య ప్రక్రియను మరోసారి దారుణంగా అపహాస్యం చేసిన బాబు సర్కార్
సాక్షి, అమరావతి: గ్రామ స్వరాజ్యానికి పునాదిగా చెప్పుకునే పరిషత్ ఎన్నికలను చంద్రబాబు సర్కార్ దారుణంగా అపహాస్యం చేసింది. పచ్చ ముఠాల అరాచకాలు.. ప్రజాస్వామ్య ప్రక్రియకు కిరాయి మూకలతో వెన్నుపోటు పొడవటాన్ని ఎన్నికల అధికారులు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోతే.. పోలీసులే స్వయంగా దొంగ ఓటర్లకు అండగా నిలిచారు. నిజమైన ఓటరు తన ఓటు తాను వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పల్లె ఓటరు తీర్పుకు బదులు బయటి నుంచి తరలించిన దొంగ ఓటర్ల ఓట్లే పెట్టెల్లో పడ్డాయి. మొన్న.. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లో ఆడిన దొంగ ఓట్ల ఆటను అధికార టీడీపీ ఈసారి పల్లెలకూ విస్తరించింది.
గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ నాడు గ్రామాల్లోని బూత్‌లు ఓటర్లతో కాకుండా బయటి నుంచి టీడీపీ తరలించిన మనుషులతో నిండిపోయాయి. స్థానిక ఓటర్లు క్యూలో నిలబడి ఉంటే.. ఆ ఊళ్లతో సంబంధం లేని బోగస్ వ్యక్తులు దర్జాగా దొంగ ఓట్లు వేసి వెళ్లిపోయారు. దొంగ ఓటర్లను ఆపాల్సిన పోలీసులే వారికి దారి చూపించారు. దగ్గరుండి మరీ దొంగ ఓట్లు వేయించారు. వెరసి తాజాగా రాష్ట్రంలో జరిగిన పరిషత్ పోలింగ్ ఎన్నికలా కాకుండా టీడీపీ దొంగ ఓట్ల జాతరలా సాగింది.
పట్నం ఫార్ములా.. పల్లెల్లో పక్కాగా
మున్సిపల్ ఎన్నికల్లో బయటి ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి తరలించిన మనుషులతో దొంగ ఓట్లు వేయించిన టీడీపీ.. అదే ఫార్ములాను పల్లెల్లోనూ పక్కాగా అమలు చేసింది. గ్రామాల్లో ఎవరికి ఓటు ఉంది? ఎవరెవరు ఊళ్లో లేరు? చనిపోయిన వ్యక్తులు ఎవరు? అనే జాబితాలను ముందే సిద్ధం చేసుకుంది. ఆ పేర్లకు తగ్గట్టు బయటి మనుషులకు స్లిప్పులు పంచింది. తెల్లవారకముందే వాహనాల్లో వాళ్లను పల్లెలకు తరలించింది.
పుస్తకాలు పక్కన పెట్టించి మరీ దొంగ ఓట్ల బరిలోకి..
దొంగ ఓట్లకు ఈసారి కాలేజీ విద్యార్థులను టీడీపీ పెద్ద ఎత్తున వాడుకుంది. చంద్రగిరి నియోజకవర్గం ఓటేరులో వేల మంది విద్యార్థులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు. చదువుకునే పిల్లల చేతికి ఓటరు స్లిప్పులు ఇచ్చి బూత్‌ల్లోకి పంపారు. తాము ఏ పేరుతో ఓటేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో పిల్లలు క్యూల్లో నిలబడ్డారు.
గంజాయి బ్యాచ్‌లు.. రౌడీ మూకలు
విద్యార్థులతో పాటు పక్క జిల్లాల క్యాడర్‌నూ టీడీపీ రంగంలోకి దించింది. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి బ్యాచ్‌లు, రౌడీ మూకలు, కూలీలను సైతం తరలించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో 70 బూత్‌లలో 60 బూత్‌లు బయటి మనుషుల చేతుల్లోకి వెళ్లాయి. గుంటూరు, నరసరావుపేట, తెనాలి నుంచి వచ్చినవాళ్లే అక్కడ కనిపించారు. స్థానికంగా ఎవరికీ తెలియని ముఖాలు బూత్‌ల్లో తిరుగుతున్నా అడిగే నాథుడే లేడు.
సిరా చెరిపేయ్.. మళ్లీ దొంగ ఓటు వేసేయ్
వేలిపై సిరా పడగానే పక్కకు వెళ్లి చెరిపేయడం.. మళ్లీ క్యూలో నిలబడడం.. ఇదే తంతు రోజంతా నడిచింది. ఒక్కొక్కరు ఐదు నుంచి పదిసార్లు దొంగ ఓట్లు వేశారు. సిరా చెరపడానికి ప్రత్యేకంగా ద్రావణాలు కూడా వెంట తెచ్చుకున్నారు. ఒకే మనిషి గంట వ్యవధిలో మూడు నాలుగుసార్లు బూత్‌లోకి వెళ్లి రావడాన్ని గ్రామస్తులు కళ్లారా చూశారు. బూత్‌లోని సిబ్బంది కళ్లెదుటే ఇదంతా జరుగుతున్నా ఎవరూ అడ్డు చెప్పలేదు.
ఖాకీల కాపలాలో దొంగ ఓట్లు
దొంగ ఓటర్లకు స్వయంగా పోలీసులే రక్షణ కవచంగా నిలిచారు. బయటి మనుషులు బూత్‌ల వైపు వస్తుంటే దారి క్లియర్ చేశారు. క్యూలో ఉన్న స్థానికులను పక్కకు నెట్టేసి బోగస్ ఓటర్లను ముందుకు పంపారు. మీరు ఎవరు? ఏ ఊరు? అని గ్రామస్తులు ప్రశ్నిస్తే వాళ్లను బెదిరించి దూరంగా వెళ్లగొట్టారు. టీడీపీ నేతలు సూచించిన వారిని పోలీసులే దగ్గరుండి బూత్‌ల్లోకి పంపి దొంగ ఓట్లు వేయించారు.
ముందు ఏజెంట్ అవుట్.. తర్వాత కెమెరా బంద్
టీడీపీ కూటమి నేతలు దొంగ ఓట్లకు ముందే రంగం సిద్ధం చేశారు. ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌కు ముందు రోజే బైండోవర్ పేరుతో స్టేషన్లకు తరలించారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో 50 మంది ఏజెంట్లను రాత్రే స్టేషన్‌కు తీసుకెళ్లి రోజంతా అక్కడే ఉంచారు. మిగిలిన చోట్ల ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు గెంటేశారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం బూత్‌ల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పక్కకు లాగి రిగ్గింగ్ చేశారు. మీడియానూ లోపలికి రానివ్వలేదు.
విపక్షం ఏజెంట్లు బయటకు వెళ్లగానే సీసీ కెమెరాలను నిలిపివేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల కెమెరాలు పనిచేయలేదు. పులివెందుల మండలంలోని 19 కెమెరాల్లో పనిచేసింది రెండు, మూడేనని సమాచారం. చేజర్ల మండలం కోటితీర్థం, ఆదురుపల్లిలో వెబ్‌కాస్టింగ్ నిలిచిపోయింది. కెమెరా లేని చోట, విపక్ష ఏజెంట్ లేని చోట దొంగ ఓట్లు గుట్టలుగా పడ్డాయి. కోసిగి మండలం ఆర్లబండలో రిగ్గింగ్ ఎంతలా జరిగిందంటే మధ్యాహ్నానికే పోలింగ్ ఆపి గత్యంతరం లేని పరిస్థితుల్లో రీపోలింగ్‌కు ఆదేశించాల్సి వచ్చింది.
చచ్చినోళ్లకు ఓటు.. బతికున్నోళ్లు వెనక్కి
ఏళ్ల కిందట చనిపోయినవాళ్ల పేర్లతోనూ దొంగ ఓట్లు పడ్డాయి. ఉపాధి కోసం ఊరు వదిలి వెళ్లిన వాళ్ల ఓట్లూ పోలయ్యాయి. బతికున్న ఓటర్లు మాత్రం ఉదయం బూత్‌కు వెళ్తే ‘మీ ఓటు ఇప్పటికే పడిపోయింది’ అంటూ తిప్పి పంపారు. చాలా చోట్ల వృద్ధులు, మహిళలు ఓటు వేయకుండానే ఇంటికి తిరిగి వెళ్లారు.
దొరికితే పరార్..
కొన్నిచోట్ల గ్రామస్తులు ధైర్యం చేసి దొంగ ఓటర్లను పట్టుకున్నారు. చంద్రగిరి పరిధిలోని సాయినగర్‌లో ఒక షాపులో దాక్కున్న దొంగ ఓటర్లను వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పట్టుకునేలోగా వాళ్లు పారిపోయారు. పట్టుబడినవాళ్లూ తాము ఏ ఊరివాళ్లమో, ఎవరి పేరుతో ఓటేయడానికి వచ్చామో చెప్పలేకపోయారు.
దొంగను పట్టిస్తే.. పట్టించినోడిపైనే లాఠీ
కొంతమంది దొంగ ఓటర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించినా ఒక్క చోట కూడా కేసు పెట్టలేదు. వారిని కాసేపు పక్కన కూర్చోబెట్టి వదిలేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే పోలీసులు తిరిగి లాఠీలు ఝళిపించారు. హోసూరు, మంగళాపూర్, చాగంటివారిపాలెం.. ఇలా ఎక్కడ చూసినా దెబ్బలు తిన్నది ప్రశ్నించినవాళ్లే. సంతనూతలపాడు మండలం పడమర గురవారెడ్డిపాలెంలో కేసులు పెడతామని ఏజెంట్లను ఎస్సై బెదిరించడంతో రెండు గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది.
బాబు అధికార దాహం.. విద్యార్థుల భవిష్యత్తు బలి
పరిషత్ పీఠాల కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారతారని గురువారం జరిగిన పోలింగ్ మరోసారి రుజువు చేసింది. క్లాసుల్లో ఉండాల్సిన కాలేజీ విద్యార్థులను బస్సుల్లో ఎక్కించి పోలింగ్ బూత్‌ల ముందు నిలబెట్టారు. వాళ్ల చేతికి వేరేవాళ్ల ఓటరు స్లిప్పులు ఇచ్చి దొంగ ఓట్లు వేయించారు. చంద్రగిరి నియోజకవర్గం ఓటేరులో ఒక్కచోటే వేల మంది విద్యార్థులు క్యూల్లో కనిపించారు. ఓటు హక్కు గురించి పాఠాలు చెప్పాల్సిన వయసులో ఆ పిల్లలకు దొంగ ఓటు వేయడం నేర్పించారు. దొంగ ఓటు వేస్తూ దొరికితే కేసు పెడతారని వారికి తెలియదు.
ఒక్క కేసు చాలు.. ఆ విద్యార్థి ఉద్యోగ అవకాశాలకు, పాస్‌పోర్ట్‌కు, విదేశీ చదువుకు గండి పడుతుంది. ఆ స్పృహ కూడా లేకుండా పిల్లలను అరాచకాలకు ముందుకు తోశారు. బూత్‌ల దగ్గర గొడవలు, రాళ్ల దాడులు జరుగుతున్నచోట వారిని నిలబెట్టి వారి ప్రాణాలనూ పణంగా పెట్టారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నది స్వయంగా సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశే. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి.. అడ్డదారిలో పార్టీ గెలుపు కోసం పిల్లలను పావులుగా వాడుకున్నారు.
కాలేజీలకు సెలవిచ్చి పిల్లలను బలవంతంగా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఓటర్ల మద్దతుతో గెలవలేమని గ్రహించి, పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి పీఠాలు దక్కించుకునేలా దొడ్డిదారి ఎంచుకున్నారు. అధికారం కోసం విద్యార్థులను దొంగ ఓటర్లుగా మార్చిన ఈ పాపం టీడీపీని వెంటాడక తప్పదని ప్రజలు, విద్యావేత్లలు, రాజకీయ పరిశీలకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు చంద్రబాబును హెచ్చరిస్తున్నారు.


