3.58 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నపంట పొలాలు
సీఎం చంద్రబాబు వెల్లడి
నేడు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన
సాక్షి,అమరావతి: మురసు తుపాను ప్రభావంతో రూ.1,918 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. మురసు తుపాను నష్టాలపై ఉన్నతాధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. శుక్రవారం తాను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. మురసు తుపాను నష్టంపై సమగ్రనివేదిక త్వరితగతిన రూపొందించి కేంద్రానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా రాష్ట్రానికి రూ.1,918.55 కోట్ల మేర ప్రాథమిక నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకు తెలిపారు.
3,57,805 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతినగా, 1,86,063 మంది రైతులపై ప్రభావం పడిందని వివరించారు. ఉద్యానవన పంటలు 16,872 ఎకరాల్లో దెబ్బతినగా, 12,586 మంది రైతులు ప్రభావితమయ్యారని వెల్లడించారు. నీట మునిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు 48–72 గంటల సమయం అవసరమన్నారు. ఆర్ అండ్ బీ పరిధిలో రాష్ట్ర, జిల్లా రహదారులు 760.10 కిలోమీటర్ల వరకు దెబ్బతిన్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పరిధిలో 204.14 కిలోమీటర్ల మేర రహదారులకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వీటి పునరుద్ధరణకు రూ.92.08 కోట్లు అవసరమన్నారు.


