సాక్షి, తిరుపతి: ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు రెచ్చిపోతుంటే.. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నగర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్న టీడీపీ నేతలను వదిలేసి.. తిరిగి వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి, అలాగే భూమన తనయుడు, తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్చార్జి అభినయ్రెడ్డిపై తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశారు. వీళ్లిద్దరితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపైనా కేసులు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే సాకుతో ఈ కేసులు ఫైల్ చేయడం గమనార్హం.
కానిస్టేబుల్స్ ఫిర్యాదులతోనే..
పోలీసు సిబ్బంది ఇస్తున్న ఫిర్యాదులోతనే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తుండడం గమనార్హం. తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీ 9వ వార్డు సచివాలయం వద్ద నామినేషన్ల దాఖలు సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని హెడ్ కానిస్టేబుల్ వినోద్ కుమార్ ఫిర్యాదు చేశాడట. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నంబర్ 525/2026లో భూమన కరుణాకర్రెడ్డితో పాటు ఇతరుల పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. బైరాగిపట్టెడ 15వ వార్డు సచివాలయం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదైంది. విధుల్లో ఉన్న పోలీసుతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు బారికేడ్లను తోసి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో భూమన అభినయ్ రెడ్డిపై ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అలాగే అభినయ్తో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నంబర్ 526/2026లో కేసు నమోదైంది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారట.
టీడీపీ నేతలపై కేసులేవీ?
మరోవైపు నామినేషన్ల టైంలో దౌర్జన్యకాండకు దిగిన టీడీపీ నాయకులపై మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ సమయంలో దౌర్జన్యకాండకు దిగినట్లు కళ్ల ముందు ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా కూడా తమ అభ్యర్థులను అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోకపోవడమేంటని భూమన ప్రశ్నిస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు తిరుపతిలో రాజకీయ వివాదానికి దారితీశాయి.
ఇదీ చదవండి: విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆమెకే అవకాశం


