పొలిమేర దాటకూడదని ప్రాణం తీసుకున్నాడు.. | Mother and son Ends Life In Parvathipuram Manyam | Sakshi
Sakshi News home page

పొలిమేర దాటకూడదని ప్రాణం తీసుకున్నాడు..

Oct 17 2026 12:30 PM | Updated on Oct 17 2026 12:30 PM

Mother and son Ends Life In Parvathipuram Manyam

ఉరివేసుకున్న సురేష్‌ (ఫైల్‌), మృతి చెందిన తల్లి దేముడమ్మ (ఫైల్‌)

పార్వతీపురం మన్యం: తప్పుడు ఫిర్యాదులతో వేధింపులు తాళలేక మనస్తాపానికి గురై తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేకపోయిన కుమారుడు ఉరివేసుకుని ప్రాణ ం తీసుకున్నాడు ఈ ఘటన విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కళ్లేపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. కేవలం 25 రోజుల వ్యవధిలో తల్లీకొడుకులు పాలిక దేముడమ్మ(46), సురేష్‌(27) మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లీకొడుకులపై తప్పుడు ఫిర్యాదులు చేసి పోలీస్‌స్టేషన్‌కు రప్పించి వేదనకు గురిచేసిన మహిళపై బాధిత కుటుంబం ఎల్‌.కోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబందించి ఎస్సై జె.రామకృష్ణ, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

కళ్లేపల్లి గ్రామానికి చెందిన పాలిక సురేష్‌ ఆటో నడుపుకుంటూ తల్లిదండ్రుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన భర్తకు దూరంగా 12 సంవత్సరాల బాలుడితో ఉంటున్న ఓ వివాహితతో సురేష్‌కు పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో వారిద్దరికీ ఓ గుడిలో పెళ్లి చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ కొన్నాళ్లు విశాఖపట్నంలో.. మరి కొన్నాళ్లు కళ్లేపల్లి గ్రామంలో ఉండేవారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తరువాత తనకు భర్తతో విడాకులు తీసుకుందని మాయమాటలు చెప్పి బలవంతంగా గుడిలో పెళ్లి చేశారంటూ సురేష్‌ ఆమెకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. 

ఈ క్రమంలో ఆమె గత నెల 17వ తేదీన విశాఖపట్నం నాలుగవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సురేష్‌తో పాటు కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు  పోలీసులు సురేష్‌ కుటుంబాన్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారణ చేశారు. అనంతరం కౌన్సెలింగ్‌ చేసి ఇంటికి పంపించేశారు. ఈ ఘటనతో మనస్తాపానికి లోనై ఆరోగ్యం క్షీణించిన సురేష్‌ తల్లి దేముడమ్మ గతనెల 22వ తేదీన మృతి చెందింది. మరోమారు సదరు మహిళ ఈ నెల 14న అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సురేష్‌ తండ్రి పాలిక సత్యనారాయణ, ఆయన ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు అల్లుళ్లను పోలీస్‌ స్టేషన్‌కు రావాలని పోలీసులు ఫోన్‌ చేశారు. 

దీంతో సురేష్‌ మినహా అందరూ వెళ్లారు. సురేష్‌ పోలీస్‌స్టేషన్‌కు రాకపోవడంతో 15వ తేదీకి మళ్లీ రావాలని పోలీసులు సూచించారు. తల్లి మరణించి కర్మకాండలు పూర్తి కాలేదు. గ్రామ పొలిమేర దాటకూడదన్న ఉద్దేశంతో సురేష్‌ పోలీస్‌స్టేషన్‌కు హాజరు కాలేదు. సురేష్‌ రావాల్సిందేనని పోలీసులు పట్టుపట్టడంతో చేసేది లేక గ్రామంలో ఉన్న తన సొంత ఇంటిలో గురువారం రాత్రి  ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎల్‌.కోట పోలీసులకు ఫిర్యాదు చేయగా శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జె.రామకృష్ణ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement