సాక్షి, తిరుపతి: తిరుపతి వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీ గూండాలు చించేశారు. పోలీసుల సమక్షంలోనే ఘటన జరిగింది. వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ తరఫున ప్రపోజర్గా ఎంపీ గురుమూర్తి వెళ్లారు. నామినేషన్ కేంద్రానికి వెళ్లగానే ఎంపీని పోలీసులు అడ్డుకున్నారు. తాను ప్రపోజర్గా నామినేషన్ వేయడానికి వచ్చానని గురుమూర్తి తెలిపారు. పత్రాలు చూపించాలంటూ పోలీసులు అడిగారు. ఎంపీ గురుమూర్తి పత్రాల చూపించగానే వెంటనే టీడీపీ గూండాలు లాక్కుని చించివేశారు. టీడీపీ గూండాలకు పోలీసులు మద్దతుగా నిలిచారు.
వైఎస్సార్ జిల్లా: కడప గాంధీనగర్ నామినేషన్ సెంటర్ వద్ద టీడీపీ మూకలు భారీగా చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. కోటిరెడ్డి కాలేజీ దగ్గర వైఎస్సార్సీపీ అభ్యర్ధి త్యాగరాజుపై దాడి చేసిన టీడీపీ గూండాలు.. నామినేషన్ పత్రాలను చించివేశారు. కడప కార్పొరేషన్లో టీడీపీ గూండాగిరి కొనసాగుతోంది. వందలాది మందిని గూండాలను నామినేషన్ కేంద్రాల వద్దకు టీడీపీ తరలిస్తోంది. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ గూండాలు మోహరించారు.
కళ్లముందే నామినేషన్ పత్రాలను చించివేస్తున్నా, దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. నేడు, రేపు నామినేషన్లు పడకుండా అడ్డుకునేందుకు భారీ కుట్రలకు తెరతీశారు. అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.
ఇదీ చదవండి: పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ


