నెల్లూరు మేయర్ సీటు విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు, బీజేపీ అధిష్టానికి చివరకు భంగపాటు తప్పలేదు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి పైఎత్తులతో వీరి ఎత్తులు చిత్తయ్యాయి. మేయర్ కుర్చీ కోసం కూటమిలో మొదలైన ఆధిపత్య పోరులో శ్రీధర్‌రెడ్డి ప్రతిపాదనలకు బ్రేక్ పడగా, మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదించిన పి.రూప్‌కుమార్‌యాదవ్ పేరుకే ప్రాధాన్యం లభించడంతో రాజకీయ చదరంగంలో పైఎత్తులు ఎవరివో స్పష్టమయ్యాయి. మేయర్ సీటు బీజేపీకి దక్కాలన్న ప్రతిపాదనలు, ఆ పార్టీ ఆశలపైనా నీళ్లు చల్లినట్లయింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర రాజకీయాల్లో తన పవర్ చూపించాలనుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మేయర్ అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో గట్టి షాక్ తగిలింది. నగర పాలక సంస్థ పీఠంపై తనకు నచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టాలన్న ఆయన పట్టుదలకు చివరకు బ్రేక్ పడింది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముందు కోటంరెడ్డి రాజకీయ పాచికలు పారలేదన్న చర్చ ఇప్పుడు నెల్లూరు రాజకీయ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. కూటమి మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో సాగిన ఆధిపత్య పోరులో నారాయణ–వేమిరెడ్డి ద్వయం పైచేయి సాధించింది. నారాయణ–వేమిరెడ్డి ప్రతిపాదించిన రూప్‌కుమార్‌యాదవ్ పేరును ఖరారు చేయడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎత్తులు చిత్తయ్యాయి.
ఎమ్మెల్యే పంతం పటాపంచలు
మేయర్ అభ్యర్థి ఎంపికను కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ప్రచారం సాగింది. తను ప్రతిపాదించిన వ్యక్తికే అవకాశం కల్పించాలని పట్టుబట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనకున్న రాజకీయ పట్టును నగర పాలక సంస్థ వ్యవహారాల్లోనూ చాటుకోవాలనుకున్న ఆయన అంచనాలకు భిన్నంగా పరిణామాలు మలుపు తిరిగాయి. తన మాటే నెగ్గాలని ఎమ్మెల్యే పట్టుబడితే.. తమ మాటే చెల్లాలని మంత్రి, ఎంపీ పంతం పట్టారు. చివరకు అభ్యర్థి ఎంపికతో కోటంరెడ్డి పంతం పటాపంచలయ్యాయి.
రెండో దఫా భంగపాటు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రాజకీయ ప్రభ మసకబారిందా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో మంత్రి లోకేశ్ నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు తన హవా చాటుకోవాలని చూసిన ఎమ్మెల్యేకు ఆఖరి క్షణంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి దంపతులు చక్రం తిప్ప డంతో తీరని అవమా నం జరిగింది. తాజాగా మేయర్ అభ్యర్థి విషయంలోనూ వీరు ప్రతిపాదించిన అభ్యర్థినే ఖరారు చేయడంతో మరోసారి భంగపాటు తప్పలేదు. తాజా పరిణామాలతో కోటంరెడ్డి పవర్ పాలిటిక్స్‌కు తెరపడినట్లు తెలుస్తోంది.
కూటమిలో ఉత్కంఠకు తెర
నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థి విషయమై కూటమిలో నెల రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి, ఉత్కంఠకు తెరపడింది. ఆ పార్టీ అభ్యర్థిగా పి.రూప్‌కుమార్‌యాదవ్ పేరును అధిష్టానం శుక్రవారం రాత్రి దాదాపు ఖరారు చేసింది. మొదటి నుంచి మేయర్ అభ్యర్థిగా రూప్‌కుమార్‌యాదవ్ పేరును మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే రూప్‌కుమార్‌ను ఆ పీఠంపై కూర్చొబెడితే.. తన రాజకీయ ప్రాబల్యానికి గండిపడుతుందని భావించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ ప్రతిపాదనను బాహాటంగానే వ్యతిరేకించారు. మంత్రి, ఎంపీలిద్దరికి చెక్ పెట్టాలని ముస్లింను అభ్యర్థిగా నియమించాలని తెరపైకి తెచ్చారు.
ఈ క్రమంలో తన సోదరుడి పేరును కూడా ప్రతిపాదించారు. ఆ తరువాత పూటకో పేరు తెరపైకి రావడంతో ఆశావహులు పెరిగారు. కోటంరెడ్డి ఎత్తులను చిత్తు చేస్తూ.. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ పేర్లను తెరపైకి తెచ్చారు. రూప్‌కుమార్‌యాదవ్ పేరుకు మెజార్టీ ప్రతిపాదనలు వచ్చేలా చేసి, చివరకు ఆయన్నే ఎంపిక చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: నాలుగిస్తా.. తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు


