ఎంపీ చేతుల్లోంచి నామినేషన్‌ పేపర్లు లాక్కుని.. | Tirupati MP Accuses Police Of Failure To Protect YSRCP Leaders From TDP Goons During Nomination, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఎంపీ చేతుల్లోంచి నామినేషన్‌ పేపర్లు లాక్కుని..

Oct 17 2026 1:43 PM | Updated on Oct 17 2026 2:10 PM

Tirupati MP Accuses Police of Failure to Protect YSRCP Leaders During Nomination

సాక్షి, తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పార్టీ మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ తరఫున నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన తనను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని తిరుపతి ఎంపీ డాక్టర్‌ మద్దిల గురుమూర్తి మండిపడ్డారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్లే ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోవడం పోలీసు యంత్రాంగం వైఫల్యమని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతోందో చెప్పడానికి తామే ప్రత్యక్ష సాక్షులమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న నామినేషన్‌ కేంద్రానికి గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు తమను చుట్టుముట్టారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. నామినేషన్‌ వేయడానికి వీల్లేదని, వెనక్కి వెళ్లాలని అడ్డుకున్నారని చెప్పారు. ఆధార్‌ కార్డుతో పాటు నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్నట్లు ఆధారాలు చూపాలని పోలీసులు అడిగారని, పత్రాలను చూపిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వాటిని లాక్కెళ్లారని పేర్కొన్నారు. ఇదంతా జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు.

ఎంపీ, ఎమ్మెల్సీకే రక్షణ కల్పించలేరా?
నామినేషన్‌ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదంటూ నిబంధనలు చెబుతున్న పోలీసులు.. ఒక ఎంపీ, ఎమ్మెల్సీకి రక్షణ కల్పించలేకపోవడం విచారకరమని గురుమూర్తి విమర్శించారు. నామినేషన్‌ దాఖలు చేసి, ప్రజాప్రతినిధులను క్షేమంగా పంపించాల్సిన పోలీసు యంత్రాంగం తన విధులను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గి, ప్రతిపక్ష నేతలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

పోలీసులే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు
కూటమి ప్రభుత్వంలో పోలీసులు స్వతంత్రంగా చట్టాన్ని అమలు చేయాల్సింది పోయి, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని గురుమూర్తి వ్యాఖ్యానించారు. కూటమి కార్యకర్తల కంటే పోలీసులే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని స్పష్టం చేశారు.

నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులనే అడ్డుకుంటే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఎలా జరుగుతాయని గురుమూర్తి నిలదీశారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుస్తులు చించేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement