( ఫైల్ ఫోటో )
సాక్షి, కృష్ణా జిల్లా: పదవుల కోసం ఇంతలా దిగజారాలా? ఎన్నికల్లో ఇంతగా బరితెగించాలా? అని కూటమి సర్కార్‌ను, పోలీసులను మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కళ్లుండి కూడా డీజీపీ, ఎస్ఈసీ చూడలేకపోతున్నారని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని విమర్శించారు.
హిందూ కళాశాలలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపై చంద్రబాబు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ డీజీపీ, ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠల కంటే ధృతరాష్ట్రుడు చాలా బెటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కళ్లుండి కూడా డీజీపీ, ఎస్ఈసీ చూడలేకపోతున్నారని పేర్ని నాని విమర్శించారు. కళ్ల ముందే ఎన్నికల్లో అన్యాయం జరుగుతున్నా.. కుర్చీ కోసం మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. పదవుల కోసం ఇంతలా దిగజారాలా? ఎన్నికల్లో ఇంతగా బరితెగించాలా? ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయాలా? అని ప్రశ్నించారు. ఉన్మాదుల మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. అంతా బాగానే ఉందని అనుకుంటున్నారని, 2029లో ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు పరిస్థితి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పులివెందులలో నేరగాళ్లను పిలిపించి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారికి మానసిక రుగ్మత వచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: డీఎస్పీ బెదిరింపులు.. తిరగబడ్డ మహిళలు


