సాక్షి, పల్నాడు: తప్పుడు వాగ్ధానాలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. స్థానిక సంస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గడిచిన పది రోజులుగా పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులు యూనిఫామ్ కింద పచ్చ చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. అరాచకాలు చేసే అందరి డేటా ఉంది. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమంటూ హెచ్చరించారు.
మాచర్లలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసుటు పెట్టి జైలుకు పంపించాలనే కుట్ర చేస్తున్నారు. మాచర్ల మున్సిపాలిటీల్లో జగనన్న ఆదేశాల మేరకు ముస్లిం మహిళకు అవకాశం ఇచ్చాం. మా కౌన్సిలర్ అభ్యర్థిని టీడీపీ గూండాలు రక్తమొచ్చేలా కొట్టారు. పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి మెయిల్ చేశాం. దారుణమైన కుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అందరికీ పెన్షన్లు ఇస్తున్నామంటూ కూటమి దారుణమైన మోసం చేస్తోంది. అడుగడుగునా ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది.
కూటమి అనుకూల మీడియాలో అన్ని అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. బీ ఫారమ్ ఇవ్వడానికి వెళ్తే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే గంజాయి బ్యాచ్ దాడి చేసింది. పేపర్లు చించివేసి దాడులు చేశారు. ఈ దాడులపై శాంతియుత నిరసన వ్యక్తం చేస్తే 33 మందిపై కేసులు పెట్టారు. కౌన్సిలర్ అభ్యర్థులను టీడీపీ గూండాలు రక్తం వచ్చినట్లు కొడితే మాపైనే కేసులు పెట్టారు. దాడులు చేసి, ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి మాపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. దీనిపై ఎస్పీ, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశాం. మా అభ్యర్థులకు బీరువా గుర్తు కేటాయించినా ప్రజల దగ్గరకు వెళ్తున్నాం.
మా ప్రభుత్వ హయాంలో మాచర్లలో 5400 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మాచర్ల చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాం. వేలాది ఇళ్ల పట్టాలను అందించాం. గత 40 ఏళ్లుగా సౌకర్యాలు లేని ఆసుపత్రిని యాభై బెడ్లుగా మార్చి అత్యాధునిక సదుపాయాలు అందించాం. అరాచకాలు సృష్టించిన ఎవరినీ వదిలిపెట్టం. తప్పకుండా సినిమా చూపిస్తాం. కారంపూడి ఎస్‌ఐని గతంలో ఉద్యోగం నుంచి తొలగించినా బుద్ధి మారలేదు. దుర్గి, వెల్దుర్తి, నాగార్జున సాగర్ ఎస్‌ఐలు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. పోటీ చేయడానికి వీల్లేదని గంజాయి కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ పచ్చ చొక్కా వేసుకుని బెదిరింపులకు దిగడం గతంలో ఎప్పుడూ లేదు.

టీడీపీ అధికారంలో ఉండేది రెండేళ్లు మాత్రమే. మహిళలను కూడా పోలీసులు బైండోవర్ల పేరుతో బెదిరిస్తున్నారు. ఇప్పటికీ 19 అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వెసే సమస్యే లేదు. బెయిల్ రద్దు చేస్తామని అంటున్నారు. అయినా వెనకడుగు వేయం. టీడీపీ బెదిరింపులకు లొంగకుండా పోటీలో ఉన్న అభ్యర్థులకు అభినందనలు. మాచర్లలో అరాచకాలు సృష్టించిన వారిపై అధికారంలోకి రాగానే సిట్ వేసి శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కూటమి ఓటమికి రె‘బెల్స్’


