నెల్లూరు జిల్లా: పరిషత్ ఎన్నికల్లో మహిళలని కూడా చూడకుండా టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ కాదని, మానిప్యులేటర్ అని చెప్పారు.
‘‘అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఎన్నికల అధికారుల నియామకం జరిగింది. ఏపీలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలను తారుమారు చేశారు. గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులే అభ్యర్థుల ఇళ్లలో మద్యాన్ని ఉంచి కేసులు నమోదు చేశారు. ప్రజల తీర్పును కాలరాస్తూ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబు జీవితం అంతా దైవర్షన్ పాలిటిక్స్ తోనే సరిపోయింది. పోలీసు వ్యవస్థ చంద్రబాబు రక్షణ సైన్యంలా పనిచేస్తుంది. కౌంటింగ్ సెంటర్ల వద్ద ఏజంట్లపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు’’ అని కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు.


