పంచాయతీల నిధులూ పక్కదారి! | Panchayat funds are also being diverted in Chandrababu ruling | Sakshi
Sakshi News home page

పంచాయతీల నిధులూ పక్కదారి!

Nov 16 2026 3:31 AM | Updated on Nov 16 2026 3:31 AM

Panchayat funds are also being diverted in Chandrababu ruling

గ్రామీణ స్థానిక సంస్థలకు చేరని దాదాపు రూ.1,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపైనా చంద్రబాబు ప్రభుత్వం పెత్తనం

పది పని దినాల్లో జమ చేయాల్సిన నిధులు.. పది నెలలుగా రాష్ట్ర ఖజానాలోనే! 

రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన రూ.1,026 కోట్లలో రూ.34.12 కోట్లు మాత్రమే విడుదల 

మిగిలిన రూ.992 కోట్లపై చంద్రబాబు ప్రభుత్వం మౌనం 

వేసవిలో నిధుల కొరతతో తాగునీటి పథకాల నిర్వహణకు ఇబ్బందులు 

మార్చి 31తో ముగిసిన 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి.. అయినా పంచాయతీలకు అందని నిధులు 

పంచాయతీరాజ్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు తూట్లు 

గతంలోనూ రెండు నుంచి ఎనిమిది నెలల వరకు నిధుల విడుదలలో జాప్యం 

విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే స్థానిక సంస్థలకు నిధుల బదిలీ

సాక్షి, అమరావతి: గ్రామీణ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపైనా చంద్రబాబు ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. పంచాయతీలకు నేరుగా అందాల్సిన దాదాపు రూ.1,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయకుండా రాష్ట్ర ఖజానాలోనే నిలిపివేసింది. నిబంధనల ప్రకారం కేంద్రం నిధులు విడుదల చేసిన పది పని దినాల్లోగా వాటిని సంబంధిత గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నెలల తరబడి ఆ నిధులను తన వద్దే ఉంచుకుంటోంది. 

2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా జనవరి 29న రూ.410 కోట్లు, ఫిబ్రవరిలో మరో రూ.616 కోట్లు కలిపి మొత్తం రూ.1,026 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇందులో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఇటీవల రూ.34.12 కోట్లు విడుదల చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. మిగిలిన దాదాపు రూ.992 కోట్లను ఇంకా స్థానిక సంస్థలకు అందించలేదు. ఈ నిధుల విడుదలలో జాప్యం వల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ, ముఖ్యంగా రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ తీవ్రంగా ప్రభావితమవుతోంది.

గడువు ముగిసినా.. పంచాయతీల ఖాతాల్లోకి చేరని నిధులు!
15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు 70:20:10 నిష్పత్తిలో పంపిణీ చేయాలి. ఇందులో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్‌లకు, 10 శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించాలి. గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు కేటాయించే నిధుల్లో కొంత మొత్తాన్ని రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు వినియోగిస్తారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య వేసవిలో అనేక గ్రామాల్లో తాగునీటి పథకాల నిర్వహణకు నిధుల కొరత ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రక్షిత మంచినీటి పథకాల సిబ్బంది వేతన బకాయిలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఇటీవల ఆ రెండు జిల్లాలకు మాత్రమే రూ.34.12 కోట్లు విడుదలకు ఆదేశాలిచ్చింది. మిగిలిన రూ.992 కోట్లపై మాత్రం స్పందించలేదు. విచిత్రమేమిటంటే.. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి సైతం ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చినా.. పాత ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను మాత్రం స్థానిక సంస్థలకు చేరవేయలేదు.

పంచాయతీరాజ్‌ డిక్లరేషన్‌ ఏమైంది?
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి పంచాయతీరాజ్‌ డిక్లరేషన్‌ పేరుతో గ్రామీణ స్థానిక సంస్థలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది. ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తామని, పంచాయతీరాజ్‌ వ్యవస్థకు పూర్వవైభవం కల్పిస్తామని, స్థానిక పాలనకు ఊతమిస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. 

కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం సకాలంలో పంచాయతీల ఖాతాల్లో జమ చేయడం లేదు. గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులనూ నెలల తరబడి రాష్ట్ర ఖజానాలోనే నిలిపివేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌ మాత్రం బహిరంగ సభల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను గాడిలో పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు.

రెండున్నరేళ్లుగా అదే జాప్యం.. విమర్శలొస్తేనే విడుదల!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు సకాలంలో జమ చేయకుండా నెలల తరబడి రాష్ట్ర ఖజానాలోనే ఉంచుకుంటోందన్న విమర్శలున్నాయి. గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించిన ప్రభుత్వం విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే నిధులను విడుదల చేసింది.
»  2025–26 తొలి విడత: కేంద్రం 2025 అక్టోబరులో రూ.1,026 కోట్లు విడుదల చేయగా.. పది పని దినాల్లోగా జమ చేయాల్సిన ప్రభుత్వం దాదాపు రెండున్నర నెలల తర్వాత, 2026 జనవరి 18న స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.
»  2024–25 తొలి విడత: 2024 సెప్టెంబరులో కేంద్రం విడుదల చేసిన రూ.988.76 కోట్లను దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో స్థానిక సంస్థలకు జమ చేసింది.
»  2024–25 రెండో విడత: 2024 డిసెంబరులో కేంద్రం విడుదల చేసిన రూ.1,121 కోట్లను ఏకంగా ఎనిమిది నెలల జాప్యం తర్వాత 2025 సెప్టెంబరులో స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.
»  2023–24 రెండో విడత: కేంద్రం 2024 మార్చి నెలాఖరులో విడుదల చేసిన రూ.998 కోట్లను ఎన్నికల కోడ్‌ కారణంగా అప్పట్లో విడుదల చేయలేదు. జూన్‌ 12న కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటికీ వెంటనే నిధులు జమ చేయలేదు. చివరకు 2024 ఆగస్టులో స్థానిక సంస్థలకు విడుదల చేసింది.

ఇలా కేంద్రం నిధులు విడుదల చేసిన ప్రతిసారీ రాష్ట్ర ఖజానాలోనే నెలల తరబడి నిలిపివేయడం, విమర్శలు వచ్చిన తర్వాతే పంచాయతీలకు బదిలీ చేయడం ఆనవాయితీగా మారింది. స్థానిక సంస్థలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం కేంద్రం కేటాయించిన నిధులపైనా పంచాయతీలకు స్వేచ్ఛ లేకుండా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement