రాజధానిలో భూమాయ | Irregularities in land acquisition and acquisition of capital Amaravati | Sakshi
Sakshi News home page

రాజధానిలో భూమాయ

Nov 16 2026 3:19 AM | Updated on Nov 16 2026 3:19 AM

Irregularities in land acquisition and acquisition of capital Amaravati

భూసమీకరణ, సేకరణల్లో అక్రమాలు..

ప్రపంచబ్యాంకు, ఏడీబీకి రాజధాని రైతుల ఫిర్యాదు 

భూసమీకరణ కింద తీసుకోని భూముల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించారు  

వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు

ఒకరి భూమి బదులు మరొకరి భూమి సేకరిస్తున్నారు  

హైకోర్టు తీర్పును.. ప్రపంచబ్యాంకు, ఏడీబీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు  

దీనిపై స్వతంత్ర విచారణ జరిపి న్యాయం చేయాలంటూ రాజధాని ప్రాంత రైతు సమాఖ్య వినతి

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూసమీకరణ, భూసేకరణ ప్రక్రియల్లో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) అధికారులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)లకు రాజధాని ప్రాంత రైతుల సమాఖ్య (సీఆర్‌ఎఫ్‌ఎఫ్‌) ఫిర్యాదు చేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా సేకరించిన ప్రభుత్వ అంతర్గత ఫైళ్లు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నడుస్తున్న వివిధ కేసుల్లో రికార్డుల ఆధారంగా.. సీఆర్‌డీఏ అధికారులు చేస్తున్న తప్పిదాలు కేవలం పొర­పాట్లు కాదని, ఇవి క్రమబద్ధంగా జరుగుతున్న అక్రమాలని ఆరోపించింది. 

భూములు చట్టబద్ధంగా సీఆర్‌డీఏ ఆ«దీనంలోకి రాకముందే ఆయా ప్రైవేట్‌ భూముల్లో లేఅవుట్లు వేయడం, రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించడం ఏ చట్టం కింద సాధ్యమని ప్రశ్నించింది. గతంలో అధికారులు జారీచేసిన దాదాపు 1,197.30 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్లను లోపాల కారణంగా సీఆర్‌డీఏ వెనక్కి తీసుకోవడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని ఎత్తిచూపింది.  

» రాయపూడి గ్రామంలో బుచ్చయ్య గద్దె అనే రైతుకు చెందిన సర్వే నంబరు 164/2, 159ల్లోని 3.29 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం కింద సీఆర్‌డీఏకి ఇవ్వలేదని, ఆ భూమిని ప్రభుత్వం చట్టబద్ధంగా స్వా«దీనం చేసుకోలేదని సీఆర్‌ఎఫ్‌ఎఫ్‌ పేర్కొంది. కానీ ఆ ప్రైవేట్‌ భూమిలో సీఆర్‌డీఏ ఏకంగా 19 నివాస (రెసిడెన్షియల్‌) ప్లాట్లను సృష్టించి.. అందులో 8 ప్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసి మూడో వ్యక్తికి బదలాయించిందని ఎత్తిచూపింది. సదరు రైతుకు తెలియకుండానే సీఆర్‌డీఏ అధికారులు ఫామ్‌ 9.14బీ (అభివృద్ధి ఒప్పందం) పత్రాలను దొడ్డిదారిన సిద్ధం చేస్తున్నట్లు క్షేత్రస్థాయి ఆధారాలను బ్యాంకుల ముందుంచారని వెల్లడించింది.  

» రాయపూడిలో పెనుమత్స శేషుకుమారి అనే మహిళా రైతు సర్వే నంబరు 93–ఏ3లోని తన 1.21 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇవ్వలేదని, కానీ సీఆర్‌డీఏ రికార్డుల్లో ఆమె ప్రమేయం లేకుండానే ఒక కమర్షియల్‌ (వాణిజ్య), ఒక నివాస (రెసిడెన్షియల్‌) ప్లాట్లను కేటాయించినట్లు కాగితాలు సృష్టించారని తెలిపింది. స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన వారికే ప్లాట్లు ఇవ్వాలనే కనీస ల్యాండ్‌ పూలింగ్‌ సూత్రానికి ఇది విరుద్ధమని సీఆర్‌ఎఫ్‌ఎఫ్‌ పేర్కొంది.  

» వెంకటపాలెంలో పసుపులేటి పార్వతీదేవి అనే 70 ఏళ్ల వృద్ధురాలు కొనుగోలు చేసిన సర్వే నంబరు 196/1లోని 0.20 ఎకరాల భూమిని వదిలేసి.. రెవెన్యూ రికార్డుల లోపాల వల్ల పక్క యజమానికి చెందిన 196/2లోని 0.38 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్‌ ఇచ్చారని తెలిపింది. కనీసం సర్వే రికార్డులను సరిచూసుకోకుండానే భూసేకరణకు దిగుతున్న అధికారుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోందని ఎత్తిచూపింది.   

»  ప్రపంచబ్యాంకు, ఏడీబీ రూపొందించిన ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సోషల్‌ స్టాండర్ట్స్‌ (ఈఎస్‌ఎస్‌5–ఇన్వాలంటరీ రీసెటిల్‌మెంట్‌) నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నిధులు విడుదల చేసేముందే భూసేకరణ చట్టబద్ధంగా జరగాలని.. భూయజమానులైన రైతులకు పూర్తి పరిహారం అందిన తర్వాతే భూమిని స్వాధీనం చేసుకోవాలని గుర్తుచేసింది. కానీ రాజధానిలో రైతులతో సంబంధం లేకుండా ల్యాండ్‌ పూలింగ్, భూసేకరణ చేసి.. ఆ ప్రైవేట్‌ భూముల్లో ప్లాట్లు సృష్టించి.. మూడోవ్యక్తికి కేటాయించి, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం వల్ల ప్రపంచబ్యాంకు, ఏడీబీ నిబంధనలను ఉల్లంఘించారని సీఆర్‌ఎఫ్‌ఎఫ్‌ పేర్కొంది.  

» పౌరుల ఆస్తి హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 300ఏ కింద పూర్తి రక్షణ ఉంటుందని.. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం, ప్రభుత్వ అవసరాల కోసం చట్టపరిమితులను దాటి అధికారులు ముందడుగు వేయలేరని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను ప్రపంచబ్యాంకు, ఏడీబీకి ఇచ్చిన ఫిర్యాదులో సీఆర్‌ఎఫ్‌ఎఫ్‌ ప్రస్తావించింది.  

»   అమరావతి రాజధాని అభివృద్ధిని తాము ఎంతమాత్రం వ్యతిరేకించడం లేదని స్పష్టం చేస్తూనే.. అంతర్జాతీయ ప్రమాణాలు, చట్టబద్ధమైన పారదర్శకతను కాలరాస్తూ సాగుతున్న భూసేకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని సీఆర్‌ఎఫ్‌ఎఫ్‌ స్పష్టం చేసింది.  

»   సీఆర్‌డీఏ భూపరిపాలన, టైటిల్‌ వెరిఫికేషన్, ప్లాట్ల కేటాయింపులపై.. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇప్పటికే 54,700 ఎకరాల భారీ భూమి సేకరించిన నేపథ్యంలో, ఇంకా అదనపు భూసేకరణ, రెండోదశ భూసమీకరణ అవసరమా? లేదా? అన్నదానిపై నిజనిర్ధారణ చేసేందుకు స్వతంత్ర విచారణ చేయించాలని ప్రపంచబ్యాంకు, ఏడీబీలను రాజధాని ప్రాంత రైతుల సమాఖ్య కోరింది. చట్టవిరుద్ధంగా జరిగిన భూలావాదేవీలను అరికట్టడానికి తక్షణమే కరెక్టివ్‌ యాక్షన్‌ ప్లాన్‌ (సీఆర్‌ఏ) అమలు చేయాలని విన్నవించింది. ఈ వ్యవహారంలో కాలయాపన జరిగితే రైతులకు కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement