సాక్షి, విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడగా.. సోమవారానికి అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అక్వాన్ తుపానుగా నామకరణం చేశారు. తొలుత ఒక దిశగా కదులుతుందని భావించిన ఈ తుపాను.. యాంటీ సైక్లోన్ వ్యవస్థల ప్రభావంతో దిశ మార్చుకునే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోసారి దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలి, మచిలీపట్నం దిగువ ప్రాంతం నుంచి తీరాన్ని సమీపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్వాన్ మంగళవారానికి తీవ్ర తుపానుగా మారి, అనంతరం మరింత బలపడి వాయవ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు వచ్చి 18వ తేదీకి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతం చెన్నైకి 720 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 820 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది సాయంత్రానికి తుపానుగా, రేపటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 48 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఆగ్నేయ,ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 🛑తీవ్రవాయుగుండం ▪️గడిచిన 6 గంటల్లో 8 కిమీ వేగంతో కదలిక : ప్రఖర్ జైన్,#APSDMA ఎండీ, #RTGS సిఈవో ▪️ప్రస్తుతం చెన్నైకు 720 కి.మీ., విశాఖపట్నంకు 820కి.మీ.,గోపాల్పూర్ కు 940 కి.మీ దూరంలో కేంద్రీకృతం https://t.co/mFwDIQ67Bu
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 16, 2026
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
ఈ తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయి. తుపాను మరింత బలపడితే గాలుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తుపాను ప్రభావం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. తుపాను దిశ, తీవ్రతలో మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మూడు రోజులు భారీ వర్షాలు..
తుపాను ప్రభావంతో ఈ నెల 18 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 19, 20 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం నుంచి తీర ప్రాంతంలో గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి: కోట రుక్మిణి పాత్రపై విచారణ చేయండి


