AI జనరేటర్ ఫోటో
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రశాంతతకు, పర్యాటక అందాలకు చిరునామాగా నిలిచే భీమిలి తీరంలో ఓ ఖాకీ అధికారి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన అధికారి.. ఓ హోటల్‌లో మాత్రం నిబంధనలు, మర్యాదలు పక్కనపెట్టి హడావుడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహానికి గురై సిబ్బందిపై విరుచుకుపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఖాకీ హోదా హోటల్ నిబంధనల కంటే పెద్దదా? అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్నాయి.
హోటల్‌లో హడావుడి.. సీసీ కెమెరాల్లో సాక్ష్యాలు?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సదరు అధికారి ఓ మహిళతో కలిసి స్థానిక హోటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. హోటల్ నిబంధనలకు విరుద్ధంగా ఆమెను తీసుకురావడంపై యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆ అధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్ సిబ్బందిపై విరుచుకుపడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారి వ్యవహారమంతా హోటల్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
ఎంపీ వద్ద పంచాయితీ!
హోటల్‌లో మొదలైన వివాదం చివరకు రాజకీయ స్థాయికి చేరినట్లు సమాచారం. సీసీ కెమెరాల ఫుటేజీతో సహా హోటల్ యాజమాన్యం కూటమి ఎంపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంపీ సదరు అధికారిని పిలిపించి వ్యవహారంపై నిలదీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖాకీ హోదాలో ఉన్న అధికారి వ్యవహారం ఎంపీ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్న చర్చ మొదలైంది.
ప్రచారమే తప్ప.. పనిపై ధ్యాసేదీ?
విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిసిటీ వ్యవహారాల్లో సదరు అధికారికి ప్రత్యేక గుర్తింపు ఉందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ప్రచారంలో కనిపించే చురుకుదనం విధి నిర్వహణలో మాత్రం కానరాదన్న విమర్శలున్నాయి. హోటల్ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లినా, కేవలం హెచ్చరికతోనే సరిపెట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, సదరు అధికారికి పోస్టింగ్ విషయంలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యేకు సైతం ఆయన వ్యవహారశైలి తలనొప్పిగా మారిందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి భీమిలి తీరంలో మొదలైన ఈ ఖాకీ ఎపిసోడ్ ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.


