సాక్షి, కృష్ణా: ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ గుడివాడలో అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత నెరుసు చింతయ్య తన అనుచరులు, అభిమానులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్బంగా చింతయ్య, టీడీపీ నేతలకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి కొడాలి నాని. అనంతరం, గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై చింతయ్య సంచలన ఆరోపణలు చేశారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం చింతయ్య మాట్లాడుతూ..‘గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే జెండా మోసిన కార్యకర్తలకు సైతం బేరం పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ సీటుకు రూ.25 లక్షలకు బేరం పెడుతున్నారు. 25 లక్షలు ఉంటేనే కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అర్హులని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకోవడం వల్ల నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వైఖరి వల్ల టీడీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీలో గుర్తింపు లేదు. ఎమ్మెల్యే వైఖరి వల్లే టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నాము’ అని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ..‘నెరుసు చింతయ్య గుడివాడలో సీనియర్ నాయకులు. ఆయన సేవలు వైఎస్సార్‌సీపీకి అవసరం అవుతాయి. మున్సిపల్ ఎన్నికల వేళ చింతయ్య రాకతో వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరుతుంది’ అని అన్నారు.
కూటమిలో చిచ్చు..
ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రేపాయి. బాపులపాడు పంచాయతీ సర్పంచ్‌గా కూటమి నేతలు పోటాపోటీ నామినేషన్లు దాఖలు చేశారు. బాపులపాడు పంచాయతీ తమకు ఇవ్వాలని కోరిన గన్నవరం నియోజకవర్గ జనసేన ఇంఛార్జి చలమలశెట్టి రమేష్.. ఇదే సమయంలో ఇవ్వడం కుదరదని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ చెప్పడం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో బాపులపాడు సర్పంచ్‌గా తన భార్యతో జనసేన నేత చలమలశెట్టి రమేష్ నామినేషన్ వేయించడం గమనార్హం. మరోవైపు.. టీడీపీ మద్దతు దారుగా వడ్డిల్లి లక్ష్మీ కుమారి నామినేషన్ వేశారు. దీంతో, కూటమి నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.

ఇదీ చదవండి: చంద్రబాబు అరాచకాలు ఎక్కువ కాలం సాగవు: సజ్జల


