breaking news
Naxalite movement
-
నవనవోన్మేషం నక్సల్బరీ స్ఫూర్తి
నక్సలైట్ ఉద్యమం భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటే కాదు, దళిత ఆదివాసీ చైతన్యానికి ప్రతీక కూడా. ఆదివాసులు, దళితుల సమస్యలను అది వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణ చివేస్తూనే వారికి కొన్ని సదుపాయాలను, అవకాశాలను అందుబాటు లోకి తెచ్చే సంస్కరణలను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అంతకు మించి నక్సలైట్ ఉద్యమం ఒక త్యాగపూరిత సామాజిక జీవిత వారసత్వాన్ని అందించింది. యాభై ఏళ్ళ నక్సల్బరీ విజయాలను విస్మరించడమంటే చరిత్ర గతినీ, గతితర్కాన్నీ అర్థం చేసుకోలేకపోవడమే. ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే ఎర్రబారిన తూర్పు కొండలవైపు చూడ మన్నాడో కవి. యాభై ఏళ్ళ క్రితం అవే విప్లవ జ్వాలలు పశ్చిమ బెంగాల్‌లోని ఓ కుగ్రామం నక్సల్బరీ పేరును ప్రపంచ చరితలో చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. నాడు అక్కడ ఉవ్వెత్తున ఎగిసిన సాయుధ రైతాంగ తిరుగుబాటు, విప్లవోద్యమానికి సైద్ధాంతిక దిశను నిర్దేశించించడమే కాదు, ఆ భూస్వామ్య వ్యతిరేక పోరాట స్ఫూర్తి నేటికీ సజీవంగా నిలిచింది. ఎన్నో అనుభవాలను, మరెన్నో త్యాగాలను నింపుకొని, దాడులు, ప్రతిదాడుల మధ్యన కొండొకచో చెదిరినట్లనిపించినా.. ఎప్పటికప్పుడు కొంగొత్త బలాన్ని కూడగట్టుకొని ప్రభు త్వాలకు సవాలై నిలుస్తూనే ఉంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా, పోలీసులకూ, నక్సలైట్లకూ మధ్య జరుగుతున్న యుద్ధంగా చూప యత్నిస్తున్నాయి. కానీ నక్సలైటు సిద్ధాంతం పోరాటం, పుట్టుక, ఫలితాలు ఎన్నో సామా జిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు దారితీశాయన్నది సత్యం. ఈ రోజు ఆ ఉద్యమం గతంలో కన్నా కొంత బలహీనపడిన మాట వాస్తవమే. కానీ అది 1960 దశకం చివరి నుంచి 1980 దశకం చివరి దాకా, దాదాపు రెండు దశా బ్దాలపాటు రెండు తరాల మీద బలమైన ముద్రవేసింది. ఆ ఉద్యమం జరిగిన ప్రాంతాల్లో ఆనాడు ఉన్న పరిస్థితులను సమూలంగా మార్చివేసింది. నక్స ల్బరీ మొదలుకొని ఉత్తర తెలంగాణ వరకు కుల అణచివేతకు గురవుతున్న దళితులకు, ఫారెస్ట్, పోలీసు అధికారుల దౌర్జన్యాలకు, షావుకార్లు, భూస్వా ముల దోపిడీకి బలౌతోన్న ఆదివాసులకు నక్సలైటు ఉద్యమం, పార్టీలు కొండంత అండ అయ్యాయి. 1960ల చివర, 1970ల ప్రారంభం నాటికి గ్రామాల్లో భూస్వాములు, పెత్తందార్ల దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయి. నక్సల్బరీ చూపిన విముక్తి మార్గం ఒకరకంగా చూస్తే నక్సలైటు ఉద్యమం రాజకీయంగా రివిజనిజానికీ, సామా జికంగా ఆధిపత్య కులాలకూ, ఆర్థికంగా భూస్వాములకు, షావుకార్లకూ వ్యతి రేకంగా ఉద్భవించిందనడం నిస్సందేహం. మొత్తంగా వివిధ రకాల దోపిడీ పీడనల నుంచి విముక్తి మార్గాన్ని నక్సలైటు ఉద్యమం చూపించింది. దీనికి తోడు ప్రభుత్వాలు పట్టణాల్లో పెట్టుబడిదారులకు, గ్రామాల్లో భూస్వాము లకు పనికి వచ్చే విధానాలను ప్రముఖంగా ముందుకు తీసుకొచ్చాయి. దీనితో ఆర్థికంగా వ్యత్యాసాలు పెరిగాయి. హరిత విప్లవం భూస్వాములను మరింత సుసంపన్నులను చేయడానికే ఉపయోగపడింది. గ్రామంలో ఒక రిద్దరు జమీందార్లు చేసే దౌర్జన్యాల స్థానంలో ఆధిపత్య కులాల దౌర్జన్యాలు పెచ్చుపెరిగాయి. ముఖ్యంగా వెట్టిచాకిరీ, అంటరానితనం, మహిళలపై అత్యా చారాలు, భూములను బలవంతంగా లాక్కోవడం, ఎదురుతిరిగిన వాళ్లను హతమార్చడం పరిపాటైపోయింది. ఉత్తర తెలంగాణలో ఊరి దొరకు ప్రతి కులం వెట్టి చేయాల్సిందే. కోమట్లు ఉచితంగా సరకులు ఇవ్వాల్సిందే. గ్రామ చావిడి ముందు నుంచి పోయే కింది కులాల వాళ్లు చెప్పులు విడిచి చేత బట్టుకొని పోవాలి. అంటరానికులాలు గ్రామం మధ్య నుంచి లుంగీ కట్టుకొని పోవడానికి, బీడీలు, చుట్టలు కాల్చుకోవడానికి వీలు లేదు. ఇది ప్రజల్లో లోలోపల కోపాగ్ని రగిల్చింది. అయితే ఇది బయటకు రావడానికి నక్సల్బరీ రాజకీయాలు బలాన్నిచ్చాయి. అదే సమయంలో తెలంగాణలో కింది కులాలు ముఖ్యంగా ఎస్సీ, బీసీల్లో మొదటితరం కాలేజీల్లో చేరారు. కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు అందిపుచ్చుకున్నారు. వీరు మొదటగా పట్టణాల్లో విప్లవ రాజకీయాలను గురించి తెలుసుకున్నారు. తన గ్రామాల్లో అమలు జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలకు పరిష్కారం నక్సలైట్ పోరాటమేనని విశ్వసించారు. దాన్నే ఎంచుకున్నారు. తెలంగాణ రైతాంగ పోరాట వెల్లువ అట్లా 1969లో ప్రారంభమైన ఈ నూతన రాజకీయ చైతన్యం, ప్రచారం ఎమర్జెన్సీ అనంతరం 1977–78 మధ్య ఉత్తర తెలంగాణను ముంచెత్తింది. కొన్ని గ్రామాల్లో దొరలను గాడిదల మీద ఊరేగిస్తే, మరికొన్ని గ్రామాల్లో దొరలకు సాంఘిక బహిష్కరణ విధించారు. ఇదో సామూహిక ప్రజా ఉద్యమం. వివిధ కులాలు వెట్టికి స్వస్తి పలికాయి. మాల మాదిగలు కూలీ ఇవ్వకుండా పనులకు రామని తెగేసి చెప్పారు. భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకున్న భూముల్లో ఎర్రజెండాలు పాతి ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక ఉప్పె నలా సాగింది. దీనితో భయపడి చాలామంది భూస్వాములు గ్రామాలను వదిలి పారిపోయారు. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలుగా ఆ రోజు దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాల జైత్రయాత్ర పేరుతో వేలాదిమంది రైతులు, కూలీలు జగిత్యాల పట్టణంలో కదం తొక్కారు. సిరిసిల్లాలో ప్రతి గ్రామంలో దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. భూస్వాములు నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని ఒప్పించి సిరిసిల్ల, జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటింపజేశారు. పోలీసులు పెద్ద ఎత్తున గ్రామాల మీద పడి అరెస్టులు చేశారు. కేసులు పెట్టారు. చిత్రహింసల పాల్జేశారు. ప్రతి గ్రామాన్ని పోలీసు క్యాంపుగా మార్చారు. కానీ ప్రజలు భయపడలేదు. దొరలకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన సాంఘిక బహిష్కరణోద్య మాన్ని విర మించలేదు. గత్యంతరం లేక దొరలు గ్రామాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. అక్కడ వారు చిన్నా చితకా వ్యాపారాలు ప్రారంభించారు. ఈ రోజు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ప్రయోజనం పొందుతున్నారు. ఈ పరిణామాలు ఆ గ్రామాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పును తెచ్చాయి. వెట్టి బానిసలుగా బతుకుతున్న ప్రజలంతా విముక్తి అయ్యారు. వారికి తమ వృత్తులను స్వేచ్ఛగా చేసుకునే అవకాశం వచ్చింది. అంట రానికులాలు పాక్షికంగానైనా కుల అణచివేత నుంచి బయటికొచ్చాయి. భూములు కూడా పేదల చేతికి వచ్చాయి. కొన్నిచోట్ల భూస్వాముల భూము లను ప్రజలు ఆక్రమించుకున్నారు. అప్పటివరకు భూస్వాముల హక్కుగా ఉన్న గ్రామీణ, రాజకీయ పదవులు బీసీ కులాల వారికి దక్కాయి. ఈ సామా జిక పరిస్థితులను గమనించిన ఎన్టీఆర్ ప్రభుత్వం 1987లో తాలూ కాల స్థానంలో మండలాలను ఏర్పాటు చేసింది. మండల పరిషత్‌లకు, గ్రామ పంచాయతీలలో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది. దీనితో భూస్వాముల ప్రత్యక్ష రాజకీయ పెత్తనానికి సంపూర్ణంగా గండిపడింది. ఇది నక్సలైటు ఉద్యమం సాధించిన విజయాల్లో ప్రధానమైనది. శ్రీకాకుళ రైతాంగ పోరాటం దాదాపుగా నక్సల్బరీకి సమాంతరంగా ప్రారంభమైంది. షావుకార్లు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసింది. ఈ పోరాటంలో ఎంతో మంది మేధావులు మైదాన ప్రాంతాల నుంచి వెళ్లి ప్రాణత్యాగం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగానే అప్పటి వరకు ఎటువంటి రక్షణలు లేని గిరిజనుల అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ(ఐటీడీఏ)లను ప్రభుత్వం ప్రారంభించింది. గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా 1 ఆఫ్ 70 చట్టాన్ని తీసు కొచ్చింది. అదేవిధంగా గోదావరిలోయలోని వరంగల్, ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆదివాసులకు దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని పంచినట్టు నక్సలైట్లు తమ నివేదికల్లో చెప్పారు. దళిత, ఆదివాసీ పోరాట బావుటా నక్సల్బరీ 1980 తర్వాత నక్సలైట్లు దండకారణ్యంలోని బస్తర్ జిల్లాల్లోని ఆదివాసులను సమీకరించడానికి వెళ్లారు. 25 ఏళ్ల కిందట ఒక జర్నలిస్టుగా ఆ ప్రాంతానికి వెళ్లిన నాకు అక్కడ ఒక ఆదిమ సమాజం కనిపించింది. ప్రభుత్వాల జాడ లేదు. ఆ పరిస్థితుల్లో నక్సలైట్లను ఆదివాసీలు అక్కున చేర్చుకున్నారు. అన్నం పెట్టారు. తమ హక్కులను తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వనరు లను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని నేడు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతు న్నది. ఆదివాసీలు నక్సలైట్లు ఇచ్చిన చైతన్యాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వా లను, పోలీసులను అడవిలోనికి అడుగుపెట్టకుండా చేశారు. అప్పటినుంచే అక్కడ పోలీసులకూ, ఆదివాసీలకు మధ్యన యుద్ధం ప్రారంభమైంది. బిహార్‌లోని జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్న కుల అణచి వేతకు వ్యతిరేకంగా నక్సలైట్లు దళితులను సమీకరించారు. దానికి వ్యతిరే కంగా ఆధిపత్య కులాలు రణవీర్ సేన పేరుతో ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం కూడా రణవీర్ సేనతో జతకలిసి నక్సలైట్ల అణచివేత పేరున దళితులను ఊచకోత కోశాయి. అట్లా నక్సలైట్ ఉద్యమం ఒకరకంగా దళిత, ఆదివాసీ చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని చెప్పవచ్చు. దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు నక్సలైట్ ఉద్యమం ప్రభావం తోనే వెలుగులోకి వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్య మాన్ని అణచివేస్తూనే కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టాయి. అందులో భూ సంస్క రణలు, విద్యాసౌకర్యాలు, హాస్టల్స్, ఇండ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం లాంటి ఎన్నో పథకాలను దళిత, ఆదివాసీ వాడల్లోకి తీసుకొచ్చారు. అంతకు మించి నక్సలైట్ ఉద్యమం ఒక త్యాగపూరిత సామాజిక జీవి తాన్ని నేర్పించింది. తెలంగాణ, ఆం«ధ్రప్రాంతాల్లో 1970–80 ప్రాంతాల్లో ఎన్నో వందలమంది యువకులు చదువులకు, ఉద్యోగాలకు స్వస్తి చెప్పి ఉద్య మంలోకి వచ్చారు. గ్రామాల్లోని యువకులు తమ తల్లిదండ్రులను వదిలి పెట్టారు. ఒకరకంగా ప్రజల కోసం ప్రాణాలైనా ఇవ్వాలనే తెగింపును, సాహ సాన్ని ఆ ఉద్యమం అందించింది. అయితే ఈ రోజు అటువంటి యువతరం లేదు. ప్రపంచీకరణ, సరళీకరణ అమలులోనికి వచ్చిన తర్వాత వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయింది. నేను, నా కుటుంబం అనే భావన ఎక్కువైంది. నక్స లైట్ ఉద్యమంపై ఎన్ని విమర్శలున్నా, ఆ భావాలు, ఆచరణ, విజయాలను అందరూ అంగీకరించాల్సిందే. యాభై ఏళ్ళ నక్సల్బరీ అందించిన విజయా లను విస్మరించడమంటే చరిత్రను విస్మరించడమే, చరిత్ర గతినీ, గతితర్కాన్నీ అర్థం చేసుకోలేకపోవడమే. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
ఇన్ఫార్మర్ల పేరిట హత్యల పరంపర
- ఇప్పటి వరకూ నక్సల్స్ చేతిలో 493 మంది హతం - మహారాష్ట్రలో 1980 నుండి నక్సల్స్ కార్యకలాపాలు గడ్చిరోలి : రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా నక్సల్స్ హత్యల పరంపర కొనసాగుతోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు, జిల్లాపరిషత్, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పలువురు సాధారణ పౌరులను సైతం పోలీస్ ఇన్ఫార్మర్ల పేరిట తీవ్రవాదులు హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. 1980 నుండి మహరాష్ట్రలో నక్సలైట్ ఉద్యమం ఊపందుకోంది. అప్పటి నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్, గోండియా జిల్లాల్లో సుమారు 493 మంది నక్సల్స్ చేతిలో హత్యకు గురైనట్లు రాష్ట్ర నక్సల్స్ వ్యతిరేక పోలీసు విభాగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒక్క గడ్చిరోలి జిల్లాలోనే అత్యధికంగా (451) మంది ఉన్నారు. గోండియాలో(33), చంద్రాపూర్‌లో(9) మంది హతులయ్యారు. ఫిబ్రవరి 1985 నుంచి జూలై, 2014 మధ్య కాలంలోనే నక్సలైట్లు ఎక్కువగా సాధారణ పౌరులను పొట్టనపెట్టుకున్నారని ఆ నివేదిక తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో ఇన్ఫార్మర్ల పేరుతో 206 మంది,188 మంది సాధారాణ పౌరులు, 24 మంది పోలీస్ పటేళ్లు, 14 మంది లొంగిపోయిన నక్సల్స్, 5గురు మాజీ పోలీస్ పటే ళ్లను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిరోంచ దళం పేరుతో షురూ నక్సలైట్ ఉద్యమం మొట్టమొదటి సారి గడ్చిరోలిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిని దాటి మహారాష్ట్రలోని సిరోంచ తాలుకాలోని లంకచేన్ గ్రామానికి విస్తరించింది. ఇక్కడ నుండి సిరోంచ దళం పేరుతో నక్సలైట్లు తమ కార్యకలాపాలను కొనసాగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 260 మంది క్యాడర్ 17 నుండి 19 దళాలుగా గడ్చిరోలి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటిదాకా 10 మంది సాధారణ పౌరులను నక్సల్స్ హతమార్చినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లతో తీవ్రవాదులకు గట్టి ఎదురె దెబ్బ తగిలింది. వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ, అంతకంతకూ నక్సలైట్లు ఆంధ్రప్రదేశ్ నుండి మహరాష్ట్రలోకి చొరబడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వారాన్ని నక్సల్స్ ‘అమరవీరుల వారోత్సవం’గా ప్రకటించారని పేర్కొన్నారు.