అతడో అస్తిత్వ స్వరం! | Guest Column Special Story On The Occasion Of Nagappagari Sundararaju's Death Anniversary | Sakshi
Sakshi News home page

అతడో అస్తిత్వ స్వరం!

Jul 16 2026 1:22 PM | Updated on Jul 16 2026 1:22 PM

Guest Column Special Story On The Occasion Of Nagappagari Sundararaju's Death Anniversary

నాగప్పగారి సుందర్రాజు

ఇన్‌ బాక్స్‌

తెలుగు దళిత సాహిత్యంలో మాదిగ అస్తిత్వాన్ని స్వతంత్ర సాహిత్య వాదంగా ముందుకు తీసుకొచ్చిన రచయిత నాగప్పగారి సుంద ర్రాజు. దళిత, బహుజన ఉద్యమాల ధిక్కార స్వరాన్ని మాదిగ సాహిత్యం ద్వారా కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు. 1968 మే 31న కర్నూలు జిల్లా మొలగవెల్లి కొట్టాలలో జన్మించాడు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలు, రాయలసీమ కథలపై పరిశోధన చేశాడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కేవలం 32 ఏళ్లకే 2000 జూలై 17న కన్ను మూశాడు. ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు దళిత సాహిత్యంపై చెరగని ముద్ర వేశాడు.

సుందర్రాజు రచనలు మాదిగ సమాజ జీవన వాస్తవాలను, కులవివక్షను, భూస్వామ్య దోపిడీని, జోగిని వ్యవస్థ వంటి అమానవీయ ఆచారాలను వాస్తవిక దృక్పథంతో చిత్రించాయి. ఛండాల చాటింపు, మాదిగోడు, మాదిగ చైతన్యం, మా ఊరి మైసమ్మ వంటి రచనలు మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి సాహిత్య రూపాలుగా నిలిచాయి. తెలుగులో తొలి మాదిగ కవుల సంకలనం ‘మాదిగ చెతన్యం’. సెంట్రల్‌ యూనివర్సిటీలో ‘మాదిగ సాహిత్య వేదిక’ను స్థాపించి, మాదిగ సాహిత్యానికి ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించేందుకు ఆయన చేసిన కృషి తెలుగు దళిత సాహిత్య చరిత్రలో ఒక సంచలనానికి కారణమయ్యింది.

మాండలికం ద్వారా కూడా ఒక సామాజిక చరిత్రను అస్తిత్వ వ్యక్తీకరణగా మలచడం ఎలాగో ఆయన కథా శిల్పంలోని ప్రధాన విశిష్టత. ఈ కారణంగానే ఆయన రచనలు రాయలసీమ మాండలిక సాహిత్యానికి కొత్త దిశను నిర్దేశించి నవిగా గుర్తింపుపొందాయి. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, బండి నారాయణస్వామి వంటి సాహితీవేత్తల ప్రశంసలు పొందాయి.

నాగప్పగారి సుందర్రాజు సాహిత్యం కేవలం సృజనాత్మక రచన మాత్రమే కాదు; అది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతిధ్వనిగా, సామాజిక న్యాయానికి సాహిత్య ప్రకటనగా, అన్యాయంపై ధిక్కార స్వరంగా వినిపిస్తుంది. అర్ధశతాబ్దం కూడా భౌతికంగా జీవించలేకపోయినా అనేక శతాబ్దాల దళిత జీవితాల బాధలను, గాథలను సాహిత్యీకరించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన రచనలు దళిత సాహిత్య అధ్యయనానికి, సామాజిక చైతన్యానికి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాలుగా నిలిచాయి.
– డా. దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (రేపు నాగప్పగారి సుందర్రాజు వర్ధంతి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement