దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్..
నిలిచిన కార్యకలాపాలు
9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో
150 డాక్యుమెంట్లే నమోదు
మొదటి రోజు రూ.1.32 కోట్లకే
పరిమితమైన ఆదాయం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖరులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త పెన్‌డౌన్ ఆందోళన సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఆందోళనలో భాగంగా జిల్లాలోని తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజు లేఖరులు విధులు బహిష్కరించారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై కొంత ప్రభావం పడింది. సాధారణంగా జిల్లా పరిధిలోని తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 350 నుంచి 400 వరకు డాక్యుమెంట్లు నమోదు అవుతుంటాయి. వీటి ద్వారా రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. అయితే పెన్‌డౌన్ మొదటి రోజైన సోమవారం కేవలం 150 డాక్యుమెంట్లు మాత్రమే నమోదు కాగా, రూ.1.32 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర తెలిపారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఉపేంద్ర తెలిపారు. జిల్లాలో సూపర్‌బజార్, ద్వారకానగర్, గోపాలపట్నం, మధురవాడ, ఆనందపురం, భీమిలి, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి కార్యాలయంలో ‘మై హెల్ప్ డెస్క్’లను ఏర్పాటు చేసి, దస్తావేజులు సిద్ధం చేసుకునేందుకు అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్లు కూడా సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
జీవో 396 రద్దు చేయాలని డిమాండ్
రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం విశాఖపట్నం అర్బన్ శాఖ ఆధ్వర్యంలో పెన్‌డౌన్ ఆందోళన ప్రారంభమైంది. సూపర్‌బజార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు రిలే నిరాహార దీక్ష చేపట్టి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సంఘం నాయకుడు మజ్జి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 30 మంది లేఖరులు పాల్గొన్నారు. జీవో ఎంఎస్ నెం.396 ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించే చర్యలను విరమించుకోవాలని, ప్రతిపాదిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే దస్తావేజు లేఖరుల లైసెన్సులను తక్షణమే పునరుద్ధరించాలని, దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్ల జీవనోపాధిని ప్రభుత్వం పరిరక్షించాలని కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.


