ఉత్తరాంధ్రకు గేట్‌వేగా భోగాపురం విమానాశ్రయం | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రకు గేట్‌వేగా భోగాపురం విమానాశ్రయం

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

వచ్చే నెల 1న ప్రారంభానికి కనెక్టివిటీ, రవాణా ఏర్పాట్లు వేగవంతం

పది రోజుల పాటు ఉత్సవాలు..

ప్రచార కార్యక్రమాలు

మహారాణిపేట: వచ్చే నెల 1న ప్రారంభం కానున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వేగా నిలవనుందని కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో విమానాశ్రయం ప్రారంభాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.

28 రహదారులతో అనుసంధానం: విశాఖ నుంచి విమానాశ్రయానికి 28 ప్రధాన రహదారులు (238 కి.మీ) అందుబాటులో ఉన్నాయని, అన్ని మార్గాల్లో సైనేజీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. బ్రౌన్‌ఫీల్డ్‌, గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులను డిసెంబరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏడు ప్రాధాన్య రహదారుల్లో నాలుగు పూర్తయ్యాయని, అడవివరం–శొంఠ్యాం రహదారికి అటవీ అనుమతులు లభించాయని, జుత్తాడ రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.

20 ప్రత్యేక బస్సులు.. 9 లాంజ్‌లు

విమానాశ్రయానికి 20 ప్రత్యేక బస్సులను కేటాయించగా, ఇప్పటికే తొమ్మిది అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గాజువాక, బీచ్‌ రోడ్‌ మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు నడపడంతో పాటు నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం లాంజ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

కూడళ్ల అభివృద్ధిపై సమీక్ష

కూడళ్లు, ఫ్రీ లెఫ్ట్‌లు, సిగ్నల్‌ పాయింట్ల అభివృద్ధిపై కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు విమానాశ్రయానికి సులభంగా చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలు సూచించారు. సమావేశంలో వీఎంఆర్డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి. విష్ణుకుమార్‌ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement