విద్యార్థులు హార్డ్‌వర్క్‌తో పాటు
స్మార్ట్‌వర్క్‌పైనా దృష్టి పెట్టాలి
షైనింగ్ స్టార్స్ అవార్డుల
ప్రదానోత్సవంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
134 మంది విద్యార్థులకు అవార్డులు
బీచ్‌రోడ్డు: ‘షైనింగ్ స్టార్స్’ అవార్డు విద్యార్థుల విజయ ప్రస్థానంలో తొలి మెట్టు మాత్రమేనని, ఇక్కడితో ఆగిపోకుండా విజయాల పరంపర కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో సోమవారం నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌వర్క్‌పైనా దృష్టి సారిస్తే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. విశాఖ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ చేతుల మీదుగా నేను కూడా..
తన పాఠశాల రోజుల్లో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.ఎస్.రావత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నానని, ఈ కార్యక్రమం ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసిందన్నారు. తాను కూడా పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచానని, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రతి విద్యార్థి విజయాన్ని అందుకోవచ్చని పేర్కొన్నారు.
134 మందికి అవార్డులు
2026, మార్చిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలోని 11 మండలాలకు చెందిన 134 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.26.80 లక్షల ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


