సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే భక్తులకు మహా పర్వదినం. భక్తిప్రపత్తులతో స్వామిని స్మరిస్తూ సాగే ఆ ఆధ్యాత్మిక యాత్ర.. ఈసారి జీవీఎంసీ, ప్రభుత్వ అధికారుల పుణ్యమాని భక్తుల పాదాలకు ‘శిక్ష’గా మారే ప్రమాదం పొంచి ఉంది. లక్షలాది మంది భక్తులు నడిచే దారిలో కంకర తేలిన రోడ్లు, లోతైన గుంతలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఈ నెల 28న అప్పన్న గిరి ప్రదక్షిణకు సమయం ఆసన్నమవుతోంది. పర్వదినం ముంచుకొస్తున్నా యంత్రాంగంలో ఇసుమంతైనా చలనం లేదు. సుమారు 32 కిలోమీటర్ల మేర చెప్పులు లేకుండా నడిచే లక్షలాది భక్తుల పట్ల పాలకులకు కనీస కనికరం కరువైంది. మార్గమధ్యంలో ఛిద్రమైన రహదారులకు కనీస మరమ్మతులు కూడా నోచుకోలేదు.
ఎక్కడికక్కడ తవ్వకాలు.. అధ్వానంగా రోడ్లు
ప్రదక్షిణ మార్గం గుంతలమయంగా మారి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఎక్కడికక్కడ పైకి లేచిన కంకర రాళ్లు భక్తుల పాదాలను చీల్చేలా ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లన్నీ ఛిద్రంగా ఉండగా.. మరికొన్ని చోట్ల కల్వర్టులు, భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వేశారు. స్వామి సేవలో తరించేందుకు వచ్చే భక్తుల పట్ల ప్రభుత్వానికి, అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ గిరి ప్రదక్షిణ మార్గం చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
నిద్రలేవాల్సిన యంత్రాంగం
‘మమ్మల్ని నడిపించేది ఆ సింహాద్రి నాథుడే‘ అన్నది భక్తుల కొండంత విశ్వాసం. కానీ, ఆ విశ్వాసాన్ని అధికారుల నిర్లక్ష్యం గుంతల పాలు చేస్తోంది. కళ్లు మూసుకుని ఆ అప్పన్నను స్మరిస్తూ సాగే భక్తియాత్రకు.. కళ్లు తెరిపిస్తున్న కఠోర వాస్తవ చిత్రాలివి. భక్తి భావంతో అడుగులు వేసే భక్తుల పాదాలు నెత్తురోడక ముందే యంత్రాంగం మేల్కొనాలి. యుద్ధప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టి, భక్తులకు సురక్షితమైన ప్రదక్షిణ మార్గాన్ని అందించాలి. లేదంటే అప్పన్న భక్తుల ఉసురు అధికారులకు తగలక మానదు.
– సాక్షి, విశాఖపట్నం,
ఫొటోలు: ఫొటోగ్రాఫర్, సాక్షి, విశాఖపట్నం
సీతమ్మధార ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ వెనుక గేట్ వద్ద


