గుంటూరులో మహిళపై దాడి బాధితులకు వైఎస్సార్‌సీపీ నేతల భరోసా
సాక్షి, అమరావతి:/లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కృష్ణబాబు కాలనీ 21వ డివిజన్‌లోని మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి మల్లెల మూర్తి, అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనను వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బాధిత కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా తదితరులు పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని..అధైర్యపడవద్దని బాధితురాలికి భరోసా ఇచ్చారు. అనంతరం నూరిఫాతిమా, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
మహిళను ఉద్దేశపూర్వకంగానే అత్యంత క్రూరంగా రోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేసి గాయపరిచారని విమర్శించారు.ఈ కేసులో టీడీపీ పెద్దలు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళల రక్షణ కేవలం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. గుంటూరులో ముగ్గురు మంత్రులు, ఒక కేంద్ర మంత్రి, మహిళా కమిషన్ ఆఫీస్ ఉన్నా ఈ ఘోరం జరగడం శోచనీయమన్నారు. ఒక మహిళకు ఇంతటి అన్యాయం జరిగితే ఎమ్మెల్యే గల్లా మాధవి నిందితుడినే కాపాడటం నీచమని అన్నారు.
లంచం ఇవ్వలేదన్న కోపంతో గుంటూరులో టీడీపీనేత కీచకపర్వం
లంచం ఇవ్వలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేసి వేధించారని గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిగ్గు, శరం అనేది ఉంటే హోంమంత్రి అనిత ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేసిందే కాకుండా, నిన్ననే జరిగినట్టు, తాము వేగంగా స్పందించినట్టు ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
సీసీ టీవీ ఫుటేజ్‌లు, సాక్షి మీడియా ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడైన టీడీపీ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, చేతులు దులిపేసుకున్నారన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్ చేయాలని చూసినా, బాధితులు అంగీకరించకపోవడంతో ఆమె ఆటలు సాగలేదన్నారు. తాము బాధితురాలి ఇంటికి వెళ్లి, పరామర్శించి, వాస్తవాలు తెలుసుకున్నామని చెప్పారు. ఈ ఘటనలో తప్పంతా టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అంతకు ముందే ఒకసారి బాధితురాలు, ఆమె కొడుకుపై దాడి చేశారని, కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.


