జోన్‌ ఇక్కడ.. బోర్డు అక్కడా? | - | Sakshi
Sakshi News home page

జోన్‌ ఇక్కడ.. బోర్డు అక్కడా?

Jul 19 2026 1:08 AM | Updated on Jul 19 2026 1:08 AM

ఉత్తరాంధ్ర నిరుద్యోగులపై నీళ్లు చల్లుతున్న చంద్రబాబు సర్కారు

ఆర్‌ఆర్‌బీ కార్యాలయాన్ని అమరావతిలో పెట్టాలంటూ ప్రతిపాదనలు

దేశవ్యాప్తంగా జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌లోనే మెజారిటీ ఆర్‌ఆర్‌బీలు

ఇప్పటికే పలు కార్యాలయాల్ని విశాఖ నుంచి తరలించేసిన ప్రభుత్వం

ఆర్‌ఆర్‌బీ తరలిపోతున్నా పట్టించుకోని ఉత్తరాంధ్ర కూటమి నేతలు

సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. జోన్‌ ప్రధా న కార్యాలయం విశాఖలో ఏర్పాటు కావడంతో, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) కూడా ఇక్కడే ఏర్పాటవుతుందని భావించింది. దీంతో స్థానికంగా ఉద్యో గావకాశాలు పెరగడంతో పాటు, రైల్వే నియామక ప్రక్రియలో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తీరతాయని ఆశించింది. అయితే ఆ ఆశలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో ఏర్పా టు కావాల్సిన ఆర్‌ఆర్‌బీని అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. దీంతో ఉత్తరాంధ్ర నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

సమన్వయానికి తూట్లు

దేశవ్యాప్తంగా రైల్వే నియామక వ్యవస్థను పరిశీలిస్తే, పరిపాలనా సౌలభ్యం, సాంకేతిక సమన్వయం, నియామక ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఎక్కువగా ఆయా రైల్వే జోన్ల ప్రధాన కార్యాలయాల్లోనే ఏర్పాటు చేశారు. జోన్‌ కార్యాలయం విశాఖలో ఉండగా, ఆర్‌ఆర్‌బీని అమరావతిలో ఏర్పాటు చేస్తే పరిపాలనా, సాంకేతిక సమన్వయానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణు లు చెబుతున్నారు. క్షేత్రస్థాయి అవసరాలకు, నియామక ప్రక్రియకు మధ్య సమన్వయం దెబ్బతినడంతో జాప్యం పెరిగే ప్రమాదమూ ఉందని అభిప్రాయపడుతున్నారు.

అక్కడ పరిస్థితులు వేరు

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 21 ఆర్‌ఆర్‌బీలు పనిచేస్తున్నాయి. వీటిలో అత్యధికం సంబంధిత రైల్వే జోన్ల ప్రధాన కార్యాలయాలున్న నగరాల్లోనే ఉన్నాయి. కొన్ని మినహాయింపులు మాత్రమే ఉన్నాయి. హుబ్లీ, హాజీపూర్‌, జబల్‌పూర్‌ వంటి చిన్న నగరాల్లో జోనల్‌ కార్యాలయాలు ఉండటంతో, ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు, పాట్నా, భోపాల్‌ వంటి పెద్ద నగరాల్లో ఆర్‌ఆర్‌బీలను ఏర్పాటు చేశారు. అయితే ఏపీలో పరిస్థితి భిన్నమని నిరుద్యోగులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో వందలాది ఇంజినీరింగ్‌, ఐటీ కళాశాలలు, పరీక్షా కేంద్రాలు, రవాణా, వసతి వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌ఆర్‌బీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం వెనుక పరిపాలనా అవసరాల కంటే రాజకీయ కారణాలే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చోద్యం చూస్తున్న కూటమి నేతలు

విశాఖకు ఇంతటి ప్రాధాన్యమైన సంస్థ చేజారిపోతున్నా ఉత్తరాంధ్రకు చెందిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడంపై నిరుద్యోగ యువత, మేధావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి కీలక కార్యాలయాలు వరుసగా తరలిపోతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మౌనం వీడకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆర్‌ఆర్‌బీని విశాఖలోనే ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం, రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే గ్రూప్‌–డీ పోస్టుల భర్తీకి సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

కొనసాగుతున్న తరలింపుల పర్వం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖకు చెందిన పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం, సీబీఐ కోర్టు, మారిటైమ్‌ బోర్డు, జీఎస్‌టీ ఆడిట్‌ కార్యాలయం తదితర సంస్థలను తరలించిన తర్వాత, ఇప్పుడు నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన ఆర్‌ఆర్‌బీని కూడా అమరావతికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. గతంలో రైల్వే నియామక పరీక్షల కోసం ఏపీ అభ్యర్థులు సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌లకు వెళ్లాల్సి వచ్చేది. విశాఖలో ఆర్‌ఆర్‌బీ ఏర్పాటైతే ఆ ఇబ్బందులు తొలగుతాయని భావించిన ఉత్తరాంధ్రతో పాటు, గోదావరి జిల్లాల నిరుద్యోగులకు, ఇప్పుడు అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement