కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
మహారాణిపేట: జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. గంజాయి రవాణా మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు విద్యార్థులు, యువతలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీవోఆర్‌డీ) కమిటీ సమావేశంలో ఆయన మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఒడిశా–విజయనగరం సరిహద్దుల నుంచి జిల్లాలోకి గంజాయి రవాణా జరిగే మార్గాలు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లు, చెక్‌పోస్టుల వద్ద పోలీసు, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, ఆర్టీసీ శాఖలు సంయుక్త తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలు, స్నిఫర్ డాగ్స్ వినియోగాన్ని పెంచాలని సూచించారు. సముద్ర మార్గంలో సింథటిక్ డ్రగ్స్, కొకై న్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విశాఖ, గంగవరం పోర్టుల పరిధిలో కస్టమ్స్, కోస్ట్‌గార్డ్, పోర్టు, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బానిసైన వారికి డీ–అడిక్షన్, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించాలని ఆదేశించారు.
117 ఎన్‌డీపీఎస్ కేసులు
పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ 2026 జూన్ వరకు 117 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి 223 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 617.29 కిలోల గంజాయి, 10.83 గ్రాముల ఎండీఎంఏ, 3.2 లీటర్ల హాషిష్ ఆయిల్, మూడు ఎల్‌ఎస్‌డీ బ్లాట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 837 డ్రగ్ ఆఫెండర్ షీట్లు తెరిచామని, 26 కేసుల్లో ఆర్థిక దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ’ఆపరేషన్ వజ్ర ప్రహర్’లో భాగంగా హాట్‌స్పాట్లలో ప్రత్యేక తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, ఈగల్ అదనపు ఎస్పీ చుక్కా శ్రీనివాస్‌తో పాటు పోలీసు, నార్కోటిక్స్, కోస్ట్‌గార్డ్, కస్టమ్స్, పోర్టులు, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.


