ఆనందపురం: గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సబ్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ కూలీగా పనిచేస్తున్న మజ్జి అప్పలరాజు (49) గురువారం విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సబ్‌కాంట్రాక్టర్ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. అవి ఫలించకపోవడంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా నిరసన చేపట్టారు. అనంతరం గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మధురవాడ ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో ఆనందపురం, పద్మనాభం, భీమిలి పోలీస్ స్టేషన్ల సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడికి భార్య కుమారి, ఇద్దరు కుమారులు రమేష్, తరుణ్ ఉన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక నష్టపరిహారంతో పాటు ఒక కుమారుడికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో ఏసీపీ అప్పలరాజు, తహసీల్దార్ ఎస్. శ్రీనుబాబు, ఆర్‌ఐ అవినాష్ కంపెనీ ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


