సాక్షి, హైదరాబాద్: విజయవాడకు వెళ్లే ప్రైవేటు బస్సు ఎక్కి తే, ఎల్బీనగర్ దాటిన తర్వాత మధ్యలో రాత్రి భోజనానికో, టీ తాగేందుకో తప్ప మరెక్కడా ఆగకుండా నేరుగా విజయ వాడకు చేరుకుంటుంది. అదే, ఆర్టీసీ బస్సులో ఎక్కితే భోజన, టీ విరామాలతోపాటు అదనంగా కోదాడ, సూర్యా పేట బస్టాండ్లలో ఆగుతుంది.
ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతున్నట్లు తాజాగా ఆర్టీసీ గుర్తించింది. వేగంగా విజయవాడకు చేరుకోవాలనుకునే చాలామంది, ఈ ఒక్క కారణంతో ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నట్లు తే లింది. ఇప్పుడు గరుడ, రాజధాని సహా ప్రీమియం కేటగిరీ సర్వీసులకు, ఆ హాల్టులను తప్పించి నేరుగా విజయవాడకు నాన్‌స్టాప్ సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అవసరమైతే ఆ రెండు ప్రాంతాలకు మరిన్ని సర్వీసులు తిప్పాలని యోచిస్తోంది.
‘బెంగళూరు ప్రయోగం’ సక్సెస్‌తో...
ప్రతినెలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆర్టీసీ బస్సుల్లో సగటున 1.30 లక్షల మంది ప్రయాణిస్తుండగా, 90 వేల మంది మాత్రమే తిరిగి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. మిగతావారు ఎందుకు రావటం లేదో తెలుసుకునేందుకు ఇటీవల ఆర్టీసీ ఓ బృందాన్ని బెంగళూరుకు పంపింది. బెంగళూరు నుంచి వచ్చే క్రమంలో ప్రైవేటు బస్సులు 20 చోట్ల ఆగుతున్నాయని, ఆర్టీసీ బస్సులు కేవలం నాలుగు చోట్లే నిలుపుతున్నాయని, దీంతో చాలామంది తమకు అనుకూలమైన ప్రాంతంలోని హాల్టుల వద్దకు వెళ్లి ప్రైవేటు బస్సులు ఎక్కుతు న్నారని ఆ బృందం గుర్తించింది.
వెంటనే, ఆర్టీసీ కూడా 20 ప్రాంతాల్లో హాల్టింగ్ సదుపాయం కల్పించింది. దీంతో 20 రోజుల్లో, రోజుకు 8 శాతం వరకు ఆక్యు పెన్సీ రేషియో పెరిగి రోజుకు రూ.80 వేల ఆదాయం అదనంగా సమకూరటం మొదలైంది. ఈ సక్సెస్‌తో తాజాగా, మరో బృందాన్ని విజయవాడ, గుంటూరు సెక్టార్‌లో అధ్యయనానికి ఆర్టీసీ పంపింది. ఇందులో భాగంగా, హైదరాబాద్–విజయవాడ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు కావాలన్న డిమాండ్ ఆ బృందం దృష్టికి వచ్చింది. గతంలో గరుడ బస్సులకు ఈ స్టాపులు ఉండేవి కాదు. కానీ, ఆక్యుపెన్సీ రేషియో పేరుతో వాటిని కూడా నాన్‌స్టాప్ కోటా నుంచి తొలగించి కోదాడ, సూర్యాపేట బస్టాండ్లలోకి వెళ్లేలా మార్చారు. దీనివల్ల దాదాపు అరగంట నుంచి 40 నిమిషాల సమయం వృథా అవుతోంది. ఫలితంగా ఆర్టీసీ ప్రయాణికుల్లో 10 శాతం మంది ప్రైవేటుకు మళ్లారని భావిస్తున్నారు.
విజయవాడలో కూడా వేర్వేరు స్టాపులు...
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు నేరుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోకి వెళ్లి నిలిచిపోతాయి. కానీ, అదే హైదరాబాద్‌లో ఏపీ బస్సులు ఎంజీబీఎస్‌కే పరిమితం కాకుండా, అమీర్‌పేట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ సహా చాలా ప్రాంతాలకు వెళ్లి ఆగుతాయి. ఇప్పుడు ఇదే తరహాలో విజయవాడలో కూడా బెంజ్ సర్కిల్, ఆటోనగర్, పోరంకి, గాంధీనగర్, సత్యనారాయణపురం... ఇలాంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లేలా బస్సు రూట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించారు. గుంటూరులో కూడా ఇదే తరహా ఏర్పాటు చేయనున్నారు.


