రేషన్‌ డీలర్ల నయా మోసం.. జాగ్రత్త! | Fraud By e-Pass Weighing Machines Ration Dealers Hyderabad | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్ల నయా మోసం.. జాగ్రత్త!

Jul 20 2026 9:24 AM | Updated on Jul 20 2026 9:56 AM

Fraud By e-Pass Weighing Machines Ration Dealers Hyderabad

ఈ– పాస్‌ సాక్షిగా రేషన్‌ డీలర్ల చేతివాటం

వేయింగ్‌ మిషన్ల అనుసంధానానికి తూట్లు

గ్రేటర్‌ నగరంలో కొనసాగుతున్న తంతు

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ అభాసుపాలవుతోంది. పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు తావులేకుండా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ– పాస్‌  యంత్రాలను బరువు తూచే వేయింగ్‌ మిషన్లకు అనుసంధానం చేసినా డీలర్ల చేతివాటానికి అడ్డుకట్డపడటం లేదు. నిబంధనల ప్రకారం.. లబ్ధిదారులు  ఈ–పాస్‌ యంత్రంపై బయోమెట్రిక్‌  ఇచ్చిన తర్వాత కార్డుదారు బియ్యం కోటా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఆ తర్వాత వేయింగ్‌ మిషన్‌పై పెట్టిన బియ్యం బరువు ఈ–పాస్‌ మిషన్‌లో ఆటోమేటిక్‌గా నమోదై రసీదు వస్తుంది. ఈ సాంకేతిక నిఘా కళ్లను డీలర్లు గిమ్మిక్కులతో సులువుగా తప్పుదోవ పట్టించడం షరామామూలుగా మారింది. సగం మందికి పైగా రేషన్‌ కార్డుదారులు పీడీఎస్‌ బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో డీలర్లు బహిరంగంగానే కిలోకు రూ.10  చొప్పున లెక్కగట్టి నగదును చేతిలో పెడుతున్నారు. ఉదాహరణకు 30 కిలోల బియ్యం కోటా (ఐదు యూనిట్లు) ఉన్న కార్డుదారుకు రూ.300 చేతిలో పెట్టి పంపించడం పరిపాటిగా మారింది.

మాయాజాలం ఇలా.. 
డీలర్లు రేషన్‌ దుకాణాల్లో ముందస్తుగానే 6 కిలోల నుంచి 30 కిలోల వరకు వేర్వేరు పరిమాణాల్లో బియ్యం మూటలను కట్టి సిద్ధంగా ఉంచుకుంటుంన్నారు. కార్డులో ఐదు యూనిట్లు ఉంటే యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున 30 కిలోల బియ్యం ఇవ్వాలి. లబ్ధిదారు బియ్యం వద్దు నగదు కావాలనగానే.. అప్పటికే సిద్ధం చేసిన 30 కిలోల బియ్యం మూటను వేయింగ్‌ మిషన్‌పై పెడతాడు. దీంతో ఈ–పాస్‌ యంత్రంలో తూకం నమోదవుతుంది.

లబ్ధిదారుకు నగదు ఇచ్చి బియ్యం మూటను మిషన్‌పై నుంచి తీసి పక్కన పెట్టేస్తారు. ఆ తదుపరి వచ్చే మరో వినియోగదారుల కోసం అదే మూటను రీ– యూజ్‌ చేస్తూ డిజిటల్‌ రికార్డులను క్లీన్‌గా మెయింటెన్‌ చేయడం సర్వసాధారణమైంది. మరికొందరు లబ్ధిదారులు పూర్తిగా బియ్యం వదులుకోవడానికి ఇష్టపడక.. కొంత కోటాను తీసుకొని మిగతా దాన్ని నగ దు రూపంలో మార్చుకుంటున్నారు. ఇది బహిరంగ రహస్యమే. అయినా పౌరసరఫరా అధికారులకు ప ట్టింపు లేకుండాపోతోంది. చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement