తహసీల్దారా.. మజాకా..!
నెల్లూరు(టాస్క్‌ఫోర్స్): జిల్లాలో అధికార దుర్వి నియోగం పతాక స్థాయికి చేరింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ఓ తహసీల్దార్ కంచె చేను మేసిన చందంగా వ్యవహరించారు. నిబంధనలకు నీళ్లొదిలి ఏకంగా రూ.రెండు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని తన అత్త, భార్యకు కట్టబెట్టారు. క్రమబద్ధీకరణ ముసుగులో సాగిన ఈ భూ భాగోతం విస్మయానికి గురిచేస్తోంది.
జరిగిందిదీ..
నగరంలోని భక్తవత్సలనగర్.. రెవెన్యూ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ సర్వే నంబర్ 437, 438లో ఉన్న సుమారు 52 అంకణా ల ప్రభుత్వ స్థలాన్ని ఓ తహసీల్దార్ తన సొంతం చేసుకున్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. అయితే దీన్ని నేరుగా కాకుండా వ్యూహాత్మకంగా తన కుటుంబసభ్యుల పేరుపైకి మార్చారు సదరు అధికారి. 2019 ఎన్నికల సమయంలో హడావుడిగా జారీ చేసిన జీఓ నంబర్ 225ను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో కథ నడిపించారు. మొదటి విడతలో 30 అంకణాల స్థలాన్ని తన అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నాళ్లకు అదే స్థలాన్ని అత్త నుంచి తన భార్య పేరుపైకి గిఫ్ట్ డీడ్ ద్వారా బదలాయించారు. 2023లో మరో 22 అంకణాల స్థలాన్ని నేరుగా భార్య పేరుపైనే రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ తతంగంలో మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సహకారం సైతం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విలువైన భూమిని
అత్త, భార్యకు కట్టబెట్టిన వైనం
బహిరంగ మార్కెట్లో విలువ రూ.రెండు కోట్లకుపైనే
పతాక స్థాయికి చేరిన అధికార దుర్వినియోగం
ఇతర శాఖల అధికారుల పాత్రపైనా అనుమానాలు
వెబ్‌ల్యాండ్‌లో మాత్రం ప్రభుత్వ స్థలమే..
ఇంత తంతు జరిగి నా, వెబ్ ల్యాండ్ రికార్డుల్లో మాత్రం సదరు స్థలం ప్రభుత్వ భూమిగానే ఇప్పటికీ నమోదై ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ జరిగితే ఇందులోనూ పేరు మారాలి. అయితే ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. దీని బట్టి చూస్తే ఉన్నతాధికారుల కళ్లుగప్పి అడ్డదారిలో ఈ వ్యవహారాన్ని నడిపించారనే అంశం స్పష్టమవుతోంది. సమగ్ర విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశముంది.
విచారణకు ఆదేశించాం
ఈ విషయమై విచారణ చేపట్టాల్సిందిగా నెల్లూరు ఆర్డీఓను ఆదేశించాం, నివేదిక ఆధారంగా చర్యలు చేపడతాం.
– విజయ్‌కుమార్, డీఆర్వో
తహసీల్దారా.. మజాకా..!


