ప్రజలను వంచించిన రాష్ట్ర బడ్జెట్
● వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు
● హామీల అమలుకు మంగళం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు (పొదలకూరు): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ ప్రజలను పూర్తిగా దగా చేసిందని, సంక్షేమ పథకాలకు అరకొర నిధులను కేటాయించి ఎన్నికల హామీలకు మంగళం పాడారనే అంశం స్పష్టమవుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు, వరిగొండ గ్రామాల్లో మంగళవారం పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రైతులకు ఏ మాత్రం భరోసా ఇవ్వలేదని విమర్శించారు. మాట తప్పని జగన్‌మోహన్‌రెడ్డిని.. హామీలిచ్చి మోసగించే చంద్రబాబు నైజాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. రైతులకు యూరియాను అందజేయకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో దేన్నీ నిలబెట్టుకోకుండా నిలువునా ముంచారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అమలు చేయలేననే విషయాన్ని బడ్జెట్ ద్వారా స్పష్టం చేశారని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. యూరియా అందక కర్షకులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
జిల్లాలో రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించి.. కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం మొక్కుబడిగా ప్రకటనలు చేస్తూ, ఆచరణలో అమలు చేయడంలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు తమ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిన్నచెరుకూరుకు చెందిన పార్టీ నేత కోడూరు పురంధర్‌రెడ్డిని పరామర్శించారు. వరిగొండలో దువ్వూరు సరోజనమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర సెక్రటరీ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్, గూడూరు విష్ణువర్ధన్‌రెడ్డి, దశరథరామిరెడ్డి, దీపక్‌రెడ్డి, సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


