పరిహార చెల్లింపులో దాగుడుమూతలు
● క్రిస్ సిటీ నిర్వాసితుల ఆవేదన
చిల్లకూరు: తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న క్రిస్ సిటీ కోసం భూములను సేకరించి రెండేళ్లవుతున్నా, పరిహారం చెల్లించకుండానే అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఎదుట నిరసనను బుధవారం చేపట్టిన అనంతరం ఏఓ శిరీషకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిహారమై ప్రశ్నిస్తే, ప్రభుత్వం ద్వారా అందజేస్తామంటున్నారని చెప్పారు. చిల్లకూరు, కోట మండలాల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 986 ఎకరాలను సేకరించారని, ఆ సమయంలో తిరుపతి కలెక్టర్ ద్వారా ఎకరాకు రూ.ఎనిమిది లక్షల చొప్పున పరిహారాన్ని అందించేలా చూస్తామన్నారన్నారు. ఏపీఐఐసీ ద్వారా క్రిస్ సిటీ భూముల్లో అభివృద్ధి పనులను దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ యాజమాన్యం.. భూములను చదును చేసి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. పలుమార్లు నిరసన చేపట్టగా, 40 శాతం మంది రైతులకు పరిహారాన్ని అందించి మిగిలిన వారికి ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా నుంచి రెండు మండలాలు నెల్లూరు జిల్లాలో విలీనం కావడంతో పరిహార విషయమై పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్ సిటీ పనులను పరిశీలించిన కలెక్టర్‌కు సైతం ఈ విషయాన్ని తెలియజేశామని వివరించారు. కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. సతీష్‌యాదవ్, ఏడుకొండలు, శంకరయ్య, సుబ్రహ్మణ్యం, రంగయ్య, కోటయ్య పాల్గొన్నారు.


