మోడల్ సౌర గ్రామాల అభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం నెల్లూరులోని తన చాంబర్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 వేల మందికి పైగా జనాభా కలిగిన ఊర్లను మోడల్ సౌర గ్రామాలుగా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఈ పథకం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికీ సౌర ఆధారిత హోం లైటింగ్, నీటి సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ అవసరాలకు పంపులు, వీధి దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. తొలివిడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాళెం, మనుబోలు, కాకుపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ప్రదర్శన చూపిన ఊరిని జిల్లాలో మోడల్ సౌర గ్రామంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా రూ.కోటి మంజూరు చేస్తుందన్నారు. స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల ద్వారా ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాఘవేంద్ర, ఈఈ బాలచంద్ర, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పులి వాహనసేవలో మూలస్థానేశ్వరుడు
నెల్లూరు(బృందావనం): మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి పులి వాహనసేవ వేడుకగా జరిగింది. ఉదయం చప్పర ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. సంప్రదాయంగా స్వామి, అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉభయకర్తలుగా ఎనమలమంద శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు తదితరులు వ్యవహరించారు. కార్యక్రమాలను ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా వెంకట అజయ్‌కుమార్‌రెడ్డి, సభ్యులు కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.


