కౌలు రైతులకు అన్యాయం
నెల్లూరు(దర్గామిట్ట): కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం చేస్తోందని పలువురు నేతలు అన్నారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షను కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సీసీఆర్ చట్టాన్ని సవరిస్తామని చెప్పారని, కులాలతో సంబంధం లేకుండా భూమిలేని కౌలు రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారన్నారు. కౌలు రైతుల సంక్షేమం కోసం కొత్త చట్టాన్ని తీసుకు ప్రభుత్వం దగా చేసిందన్నారు. పంట రుణాలు ఇవ్వడం, పంటలు పోయిన సమయంలో నష్ట పరిహారం ఇప్పించడంలో నట్టేట ముంచిందన్నారు. బడ్జెట్లో కూడా తగినంత కేటాయింపుల్లేవన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు మంగలి పుల్లయ్య, గంటా లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


