క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం
నెల్లూరు(క్రైమ్): ‘క్రికెట్ బెట్టింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదు. బెట్టింగ్‌లు ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవు’ అని ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరించారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్‌ఇన్‌ల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌పై సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలను కోరారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆన్‌లైన్ యాప్‌ల్లో, ట్రేడింగ్‌ల్లో డిపాజిట్లు పెడితే అధిక లాభాలు వస్తాయని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సిబ్బందికి అభినందన
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టుచేసిన బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ కె.సాంబశివరావు, ఎస్సై పి.విజయ్ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుళ్లు కేవీ సుధాకర్, సీహెచ్ రమేష్, జయరామయ్య, శివకుమార్, కానిస్టేబుళ్లు శ్రీహరి, పార్థసారథి, సాయికిశోర్, లాజర్‌ను ఎస్పీ అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
పీఏసీఎస్ ఉద్యోగుల
రిలే నిరాహార దీక్షలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శుక్రవారం నెల్లూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రామానాయుడు, కొండూరు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నపాటి డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోందన్నారు. గత సంవత్సరం నుంచి రాష్ట్ర సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని వాపోయారు. 24వ తేదీన రాష్ట్రంలోని అన్ని పీఎసీఎస్‌ల ఉద్యోగులతో విజయవాడలో మహాదీక్షలు చేపడతామన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. కార్యక్రమంలో నేతలు కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రాధయ్య, మల్లికార్జురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఖాజామస్తాన్, సుబ్బారావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
స్వగ్రామానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కలిగిరి: మండలంలోని నాగిరెడ్డిపాళెం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం తెట్టు గ్రామానికి చెందిన యాకసిరి మధు (25) బేల్దారి పనులు చేస్తుంటాడు. అతను పని నిమిత్తం వింజమూరు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. వింజమూరు నుంచి చిల్లకర్రతో వెళ్తున్న ట్రాక్టర్ నాగిరెడ్డిపాళెం సెంటర్ వద్ద చీమలవారిపాళెం వైపు వెళ్లేందుకు యూటర్న్ తిరుగుతోంది. ఈ క్రమంలో బైక్ ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టింది. మధు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలై మృతిచెందాడు. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. కలిగిరి ఏఎస్సై రామచంద్రయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 57,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,020 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు 12 గంటల్లో, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
నిమ్మధరలు (కిలో)
పెద్దవి: రూ.83 సన్నవి: రూ.70
పండ్లు: రూ.40
క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం
క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం


