ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): విద్యాహక్కు చట్టంలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలో ని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి పిల్లల తల్లిదండ్రులు ఈ నెల 20 నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం లేదా మండల విద్యా వనరుల కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే http://cse.ap.gov.in వెబ్‌సైట్ లో విద్యార్థుల ఆధార్, ప్రాథమిక వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. ఉచిత ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 180042 58599ను సంప్రదించాలని సూచించారు.
పెన్నా డెల్టాకు 1600
క్యూసెక్కుల విడుదల
సోమశిల: సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో పెన్నా డెల్టా ఆయకట్టు రైతుల అవసరాల మేరకు 12వ క్రస్ట్ గేట్ ద్వారా 1600 క్యూసెక్కులను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 69.834 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి 3,514 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని చెప్పారు. పవర్ టెర్మినల్ ద్వారా పెన్నా నదికి 2,350, ఉత్తర కాలువకు 300, దక్షిణ కాలువకు 200, కండలేరు కాలువకు 400 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 99.462 మీటర్ల నీటి మట్టం ఉందని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,894 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,754 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.91 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


