అధికారుల డుమ్మా
● కలెక్టరేట్లో ఉద్యోగుల గ్రీవెన్స్ డే
● హాజరుకాని కొన్ని శాఖల ఆఫీసర్లు
నెల్లూరు(టాస్క్‌ఫోర్స్): ప్రభుత్వోద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నెల్లో ఒక రోజు ప్రత్యేకంగా గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఆశించిన మేర ఫలితాలను ఇవ్వడం లేదు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి జేసీ ఎంవెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్ హాజరై అర్జీలను స్వీకరించారు. కాగా దీనికి జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో వచ్చిన ఉద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలింది.
నామమాత్రంగానే..
పరిష్కార వేదికకు జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరై, తమ సిబ్బంది ఎదుర్కొంటున్న సర్వీస్‌పరమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే తాజా సమావేశానికి కేవలం కొన్ని శాఖల అధికారులు మాత్రమే వచ్చారు. వీరిలో వ్యవసాయ, గృహ నిర్మాణ, విద్య, ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖల అధికారులు మాత్రమే ఉన్నారు. దీంతో తమ అర్జీలు ఎవరికివ్వాలో తెలియక ఉద్యోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
నిరాశతో వెనుదిరిగి..
ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పీఎఫ్ సెటిల్‌మెంట్లు వంటి దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న కింది స్థాయి ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని తమకు దొరికిన అవకాశంగా భావించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాసపడి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే సంబంధిత శాఖాధిపతులు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మా సమస్యను విన్నవించుకుందామని వస్తే, కనీసం అర్జీ తీసుకునే అధికారి కూడా లేరు.. నెలకోసారి జరిగే కార్యక్రమానికి కూడా వీరు రాకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలని ఒక బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ స్పందిస్తారా..?
జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా భావించే గ్రీవెన్స్ డే విషయంలో ఉన్నతాధికారుల అలసత్వం చర్చనీయాంశంగా మారింది. విధులకు డుమ్మా కొట్టిన అధికారులపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, గ్రీవెడ్స్‌డేకు అందరు అధికారులు హాజరయ్యేలా చూడాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
తప్పక హాజరుకావాలి
ప్రభుత్వోద్యోగుల గ్రీవెన్స్‌డేకు అన్ని శాఖల అధికారులు తప్పక హాజరుకావాలి. రానివారికి తగిన సూచనలిచ్చి సమస్యలు పరిష్కరించేలా చూస్తాం. అన్ని శాఖల అధికారులు వచ్చేలా చర్యలు చేపడతాం.
– విజయ్‌కుమార్, డీఆర్వో
అధికారుల డుమ్మా


