పరిశ్రమల స్థాపనలో సమస్యలు పరిష్కరిస్తాం
కొడవలూరు: ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సల్ పేర్కొన్నారు. మండలంలోని రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యలను ఆరాతీశారు. పెట్టుబడిదారులను ఆకర్షించి పరిశ్రమల పార్కును త్వరితగతిన పూర్తిగా నింపాలని సూచించారు. సెజ్‌లో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల శాఖ జీఎం చంద్రశేఖర్, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, ఉప పరిశ్రమల డైరెక్టర్ శ్రీధర్, ఇఫ్కో కిసాన్ సెజ్ సీఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


