ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

ఇంటర్

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

నెల్లూరు (టౌన్‌): ఇంటర్‌ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 81 సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతో పాటు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 26,935 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 26,469 మంది చొప్పున మొత్తం 53,404 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. జిల్లాలో ప్రశ్నపత్రాల స్టోరేజీకి 33 పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ స్టోరేజీ పాయింట్ల నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలను పరీక్షకు అరగంట ముందుగా పోలీసు పహారాతో తీసుకెళ్లనున్నారు.

పకడ్బందీగా నిర్వహణ

ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 81 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించాలని ఆదేశించారు. ఈ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు 81 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 81 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. వీరితో పా టు మరో 800 మందికి పైగా ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఐదు సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఆన్‌లైన్‌ సెంటర్లు, జిరాక్స్‌ సెంటర్లను మూయించనున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు.

12 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి జిల్లాలో 12 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో కోవూరు, తోటపల్లిగూడూరు, మర్రిపాడు, బిట్రగుంట, ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, కుల్లూరు, చేజర్ల, రాపూరు, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో అదనంగా అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లు, ప్రభుత్వ అధ్యాపకులను నియమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రైవేట్‌ అధ్యాపకులకూ విధులు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు తొలిసారిగా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను నియమించనున్నారు. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకులు మరో కళాశాలలో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించనున్నారు. ప్రైవేట్‌ అధ్యాపకులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తే పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఒక అంగీకారానికి వచ్చి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు కూడా ఒకరి పేపర్లు ఒకరు చూసి రాసుకునే విధంగా ప్రైవేట్‌ అధ్యాపకులు అవకాశాన్ని కల్పిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్‌ కళాశాలలకు పెద్ద ఎత్తున కొమ్ము కాస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. వీరితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది స్కూల్‌ అసిస్టెంట్లను కూడా ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారని తెలిసింది.

ఈ నెల 23 నుంచి నిర్వహణ

జిల్లా వ్యాప్తంగా

81 కేంద్రాల ఏర్పాటు

సమస్యాత్మకమైనవిగా 12 గుర్తింపు

సీసీ కెమెరాలతో నిఘా

హాజరుకానున్న

53,404 మంది విద్యార్థులు

జంబ్లింగ్‌ విధానం అమలు

చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌

అధికారులు 81 మంది చొప్పున

నాలుగు ఫ్లయింగ్‌,

ఐదు సిట్టింగ్‌ స్క్వాడ్ల నియామకం

800 మందికిపైగా ఇన్విజిలేటర్లు

తొలిసారి ప్రైవేట్‌ అధ్యాపకులకూ విధులు

సజావుగా జరిగేలా చర్యలు

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా పరీక్షలు రాసేలా చర్యలు చేపడుతున్నాం. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించాం. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలను బిగించాలని ఆదేశాలు జారీ చేశాం. మాస్‌ కాపీయింగ్‌ పాల్పడినట్లు రుజువైతే ఆయా కళాశాలల యాజమాన్యాలపై ఇంటర్‌బోర్డు నిబంధనల మేరకు చర్యలు చేపడతాం.

– వరప్రసాదరావు, ఆర్‌ఐఓ

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం 1
1/1

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement