మద్యం మత్తులో కాలువలో పడి..
● ఒడిశా వాసి మృతి
చిల్లకూరు: పొట్టకూటి కోసం పరిశ్రమలో పనిచేసేందుకు వచ్చిన ఓ కార్మికుడు పండగ రోజున ఫూటుగా మద్యం తాగి మత్తులో కాలువలో పడి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఓడూరు పంచాయతీలో ఉన్న ఓ రొయ్యల పరిశ్రమలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన నలుగురు కార్మికులు శివరాత్రి రోజున పరిశ్రమ సమీపంలోని బెల్టు దుకాణంలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. సమీపంలో ఉన్న కల్వర్టు వద్ద అందరూ కలిసి ఫూటుగా తాగారు. వారిలోని దశరధి నాయక్ (43) అనే కార్మికుడు అందరి కన్నా వెనుకగా వచ్చే క్రమంలో కాలువలో పడిపోయాడు. సహచర కార్మికులు మరుసటిరోజు విధులకు వెళ్లారు. అయితే దశరధి నాయక్ డ్యూటీకి రాకపోవడంతో పరిశ్రమ సూపర్‌వైజర్ కాంట్రాక్టర్‌ను అడగ్గా అతను చెప్పకుండా వెళ్లిపోయాడని తెలిపాడు. బుధవారం ఉదయం కాలువలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


