జగనన్న హయాంలో రైతులకు పెద్దపీట
● యూరియాను అందించలేని స్థితిలో
ప్రస్తుత సర్కార్
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు: గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్నదాతలకు పెద్దపీటేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను అందజేసి ఆదుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు, నేదురుమల్లి, విరువూరులో బుధవారం ఆయన పర్యటించారు. గత సర్కార్‌లో కిడ్నీ బాధితులకు నెలకు అందజేసిన రూ.10 వేలతో తానింకా జీవించి ఉన్నానని విరువూరు గ్రామానికి చెందిన మహిమలూరు వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకునే వారని, ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించేవని చెప్పారు. టీడీపీ పాలనలో యూరియాను అందించలేకపోతున్నారని, కర్షకులను అధోగతి పాల్జేశారని దుయ్యబట్టారు. పంటలకు కనీస మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. అర్హత కలిగిన వారికి గతంలో ఏటా రెండుసార్లు పింఛన్లను మంజూరు చేసేవారని, అయితే ప్రస్తుత సర్కార్ కొలువుదీరాక వీటి ఊసేలేదని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలన.. చంద్రబాబు పరిపాలనపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని వివరించారు.
డైవర్షన్ పాలిటిక్స్
అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలి డైవర్షన్ పాలిటిక్స్‌కు చంద్రబాబు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో పార్టీ శ్రేణులకు ఎలాంటి నష్టం వాటిల్లినా అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు. అధికారమున్నా.. లేకపోయినా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. నేదురుమల్లిలో నన్నం రమేష్, శారద దంపతుల కుమార్తె చందూషా, పొదలకూరులో నూతన దంపతులు యాకోబు, కృపామేరీని ఆశీర్వదించారు. విరువూరులో కుటుంబసభ్యులను కోల్పోయిన రామ్మోహన్‌రెడ్డి, పెంచలనాయుడ్ని పరామర్శించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, అంజద్, రమేష్, పెంచలనాయుడు, చంద్రమౌళి, తిరుపాల్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


