పింఛన్లకు నిరీక్షణే | - | Sakshi
Sakshi News home page

పింఛన్లకు నిరీక్షణే

Feb 19 2026 10:15 AM | Updated on Feb 20 2026 4:35 PM

కొత్తగా ఇవ్వరు.. పాతవి ఉంచరు

దరఖాస్తు చేసుకునేందుకూ అవకాశం కరువు

వేల సంఖ్యలో అర్హుల ఎదురుచూపులు

2024 జనవరిలో 3.19 లక్షలు.. ప్రస్తుతం 3.06 లక్షలే

టీడీపీ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఇదే తీరు

ఉన్న వాటిని తొలగించేందుకు కుట్రలు

ఎలాంటి ఆసరా లేకుండా బతుకుబండినీడుస్తున్న ఎంతో మందికి పింఛన్లు ఊరటగా నిలుస్తాయి. ప్రతి నెలా మందుల కొనుగోలుకు దీని ద్వారా వచ్చే మొత్తమే పండుటాకులకు కీలకం. దివ్యాంగులు, వితంతువులదీ ఇదే పరిస్థితి. అయితే వీరిలో ఎంతో మంది అర్హులకు మంజూరు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. టీడీపీ సర్కార్‌ కొలువుదీరి 20 నెలలు దాటినా, నేటికీ ఒక్క పింఛన్‌ను సైతం మంజూరు చేయలేదంటే వారు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. మరోవైపు ఉన్న వాటిని సైతం తొలగించేందుకు కుట్రలు పన్నుతుండటంతో పొందుతున్న వారు దినదిన గండం.. నూరేళ్లు ఆయుష్షు అనే చందంగా కాలం గడుపుతున్నారు.

నాడంతా సజావుగా..

నిజానికి పింఛన్ల కోసం గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అర్హత ఉంటే ఇంటి వద్దే పూర్తి వివరాలను వలంటీర్‌ అప్‌లోడ్‌ చేస్తే కొత్తవి మంజూరు చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పింఛన్‌ పోర్టల్‌ యాప్‌ను ఓపెన్‌ కాకుండా చేశారు.

నెల్లూరు(పొగతోట): ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం.. సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో ఇదే తరహాలో వ్యవహరించి గద్దెనెక్కిన ఆయన తాజాగా ఇదే ఫార్ములాను అవలంబిస్తున్నారు. ఆయన మార్కు రాజకీయాలకు పింఛన్లు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీరు అధికారంలోకి వచ్చి 20 నెలలైనా, నేటికీ కొత్తగా ఒక్క పింఛన్‌ను సైతం మంజూరు చేయకపోవడం గమనార్హం.

ఎడతెగని నిరీక్షణ

టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక.. మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే పింఛన్లను మంజూరు చేశారు. దీని కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇతరులకు కల్పించలేదు. ఫలితంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నెలలుగా నిరీక్షిస్తున్నారు. పింఛన్‌ను పొందేందుకు ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన దివ్యాంగుడు మస్తాన్‌ చేయని యత్నం లేదు. అయినా నేటికీ ఫలితం శూన్యం. డైకస్‌రోడ్డుకు చెందిన వసంతమ్మ భర్త మరణించడంతో దీన్ని పొందేందుకు అధికారుల చుట్టూ 15 నెలలుగా తిరుగుతున్నా, ప్రయోజనం మృగ్యమైంది. స్టోన్‌హౌస్‌పేటకు చెందిన లక్ష్మీదేవి పరిస్థితీ ఇంతే కావడం గమనార్హం. ఇలా అర్హులెంతో మంది ఉన్నా, వీరిపై కనికరం చూపే నాథుడే కరువయ్యారు.

పరిశీలన పేరిట నోటీసులు

పింఛన్ల పరిశీలన పేరుతో 43 వేల మంది దివ్యాంగులకు నోటీసులను గతేడాదిలో జారీ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగ శాతాన్ని అధికంగా నమోదు చే యించుకొని పింఛన్లు మంజూరు చేశారనే దుష్ప్ర చారాన్ని తెరపైకి తెచ్చి, ఈ వ్యవహారానికి ప్రస్తుత సర్కార్‌ పూనుకుంది. ఇదే క్రమంలో వీరందరికీ నోటీసులిచ్చి ఇబ్బందులకు గురిచేసింది. ఈ పరిణామాలతో దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్‌ రోగులు.. డాక్టర్ల చుట్టూ తిరగలేక నానా అవస్థ పడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందోళనకు దిగడం.. వ్యతిరేకత వస్తోందనే సత్యాన్ని ఆలస్యంగా గ్రహించిన సర్కార్‌ ఈ విధానాన్ని కొంతకాలం పక్కనబెట్టింది.

ప్రభుత్వం ఆదేశాలిస్తే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 3.06 లక్షల మంది లబ్ధిదారులకు నగదును ప్రతి నెలా ఒకటినే పంపిణీ చేస్తున్నాం. వితంతువులకు మంజూరు చేస్తున్నాం. పూర్తి వివరాలతో వీరు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎంపీడీఓ పరిశీలించిన అనంతరం అప్‌లోడ్‌ చేస్తారు. అర్హులకు మంజూరవుతున్నాయి. – నాగరాజకుమారి, పీడీ, డీఆర్డీఏ

రెండేళ్లలో ఇంత వ్యత్యాసమా..?

వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2024 జనవరిలో జిల్లా వ్యాప్తంగా 3,19,121 మందికి పింఛన్లను అందజేసేవారు. అయితే ఈ ఏడాది ఇదే నెల నాటికి దీన్ని 3.06 లక్షలకు ప్రస్తుత సర్కార్‌ కుదించింది. అంటే రెండేళ్లలో 13 వేల మందికి ఆసరా లేకుండా చేసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే చర్చా నడుస్తోంది.

రకరకాల కొర్రీలతో కోత 

కొత్తగా మంజూరు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. వివిధ కారణాలు చూపి ఇస్తున్న వాటినీ తగ్గించేందుకు కుయుక్తులు పన్నుతోంది. వైకల్య శాతాన్ని చూపి దివ్యాంగులకు.. విద్యుత్‌ బిల్లులు, ఇతర కారణాలతో వృద్ధులు, ఒంటరి మహిళలకు కోత విధించేందుకూ యత్నాలను సాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement