కేసులకు భయపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● విచారణకు వస్తామంటూ.. రాని పోలీసులు
నెల్లూరు రూరల్: కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బలో అఘాయిత్యానికి గురై బాలిక మృతి చెందిన ఘటనలో కుటుంబాన్ని పరామర్శించి.. నైతిక బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినందుకు తనపై అక్రమ కేసును బనాయించారని, వీటికి భయపడేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు.
పోలీసుల కోసం వేచి చూసి..
ఉదయం పది గంటలకు ఇంటికొచ్చి విచారిస్తామన్న పోలీసుల కోసం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన వేచి చూశారు. పలు కార్యక్రమాలను వాయిదా వేసి మరీ నిరీక్షించినా, వారు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిగా వ్యవహరించిన వ్యక్తిపై ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని చెప్పారు. కూటమి నేతలకు వత్తాసు పలుకుతూ.. ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. జిల్లాలో పోలీసులుండేది ప్రజల రక్షణకా.. లేకా తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకానని ప్రశ్నించారు.
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
ఎక్కడో పట్టణాలకే పరిమితమైన గంజాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాలు, గ్రామాలకూ పాకిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఇటీవల మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబానికి అండగా నిలిచి ఎక్స్ వేదికగా, మీడియా ద్వారా పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ప్రశ్నిస్తే, నోటీసులిచ్చారని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించామంటూ కేసును నమోదు చేసి విచారణకు ఈ నెల 14న రావాల్సిందిగా పోలీసులు కోరారన్నారు. తానెళ్లే సమయానికి మా ఇంటి వద్దకొచ్చి బందోబస్తు, ఇతర కారణాలతో ఇప్పుడు రావొద్దని, 19న తామే మీ ఇంటికొస్తామని పోలీసులు చెప్పారన్నారు. ఈ క్రమంలో తాను వారి కోసం నిరీక్షించగా, విచారణకు వస్తారో, రారో కూడా చెప్పలేదని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. బాలిక కుటుంబసభ్యుల వివరాలను తానెక్కడా బహిర్గతం చేయలేదని గుర్తుచేశారు. వీరిని కోవూరు ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు చైర్మన్, పరామర్శించి.. గంజాయి వల్లే జరిగిందంటూ అక్కడే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తనకు నోటీసులిచ్చి.. వారికి ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. తన కుమార్తె పూజితకు వాట్సాప్ ద్వారా నోటీసులను పోలీసులు పంపారన్నారు.
విచ్చలవిడిగా గంజాయి
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గంజాయిని అంతం చేస్తానని చంద్రబాబు ప్రకటించారని, అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఏ ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందని తెలిపారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించడం తప్ప.. అభివృద్ధి, సంక్షేమంపై సర్కార్ దృష్టి సారించడంలేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అందక అప్పులపాలై పలువురు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారని చెప్పారు.


