అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమం
ప్రభుత్వ భూములపై నిగ్గు
తేల్చాలంటున్న వైఎస్సార్సీపీ
గతంలో ప్రభుత్వ భూములు దురాక్రమణ చేశారంటూ తెగ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రస్తుతం మౌనం దాల్చడం వెనుక ఏం జరిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అధికారులతో సర్వే చేయించారు కదా? వెంటనే ఆయా భూములను స్వాధీనం చేసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలా జరగలేదంటే మీ మధ్య జరిగిన డీల్‌ను బయట పెట్టాలంటూ సవాల్ విసురుతున్నారు.
కావలిలో ‘రియల్’ ‘రాజీ’కీయం ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చుకుంది. అధికారంలోకి రాగానే వెంచర్లన్నీ ఆక్రమణలంటూ సర్వే నంబర్లతో సహా లీకులిచ్చి.. దూకుడు పెంచారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో సర్వేలు చేయించి 128 ఎకరాల ప్రభుత్వ భూములు దురాక్రమణ అయ్యాయంటూ గగ్గోలు పెట్టిన పచ్చ ప్రజాప్రతినిధులు యంత్రాలు దింపి రాళ్లు పీకించారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామంటూ రచ్చ చేసి, ఆక్రమణలపై ఒప్పందాలతో ‘సర్దుబాటు’ చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యజమానులు పచ్చ కండువాలు కప్పుకునే ‘డీల్’ కుదరడంతో ‘రాజీ రాజకీయం’తో తెరపడింది.
నా వాటా ఇస్తే సరే..
మీతో డీల్ ఓకే సార్
ఎంత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ దురాక్రమణలకు క్యాష్, కండువా డీల్స్ కుదిరియా?. గత ప్రభుత్వ హయాంలో సర్కారు భూములు దురాక్రమణ చేసి లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలతో తెగ హడావుడి చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రస్తుతం మౌనం ఇందుకు అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కావలి తూర్పు తీరంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, మరో వైపు రామాయపట్నం పోర్టు, వీటికి అనుబంధంగా పారిశ్రామిక వాడలకు భూసేకరణ జరగడంతో ఒక్కసారిగా రియల్ బూమ్.. ఊపందుకుంది.
మొదట హడావుడి..
డీల్ కుదరడంతో గప్‌చుప్
ఆ సమయంలో రియల్ వెంచర్ల వ్యాపారం ఊపందుకోవడంతో కొందరు నేతలతోపాటు ఆ రంగంలో ఎంతో కాలంగా ఉన్న వెంచర్ల యజమానులు కూడా కావలి చుట్టూ రియల్ వెంచర్లు ఏర్పాటు చేశారు. కొందరు పట్టా భూములతోపాటు ఖాళీగా కాలువ, ప్రభుత్వ పొరంబోకు భూములను కలిపేసుకుని ప్లాట్లు వేసి విక్రయాలు చేశారంటూ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇందులో ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రప్రథమంగా ఉన్నారు. ఈ క్రమంలో కావలి నుంచి ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నిక కావడంతో ఆక్రమణలు అక్రమాలంటూ తెగ హ డావుడి చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సర్వేలు చేయించారు. దాదాపు 128 ఎకరాల ప్రభుత్వ భూములన్నాయని నిగ్గు తేలాయని మీడియా ముందు తేల్చేశారు. కానీ ఇంత వరకు ఏ వెంచర్‌లో ఎంతనేది.. ఆ నివేదిక మాత్రం బయట పెట్టలేదు. ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి రెవెన్యూ అధికారులతో వెంచర్లలో బోర్డులు పెట్టించారు. మున్సిపల్ అధికారులతో పత్రికల్లో హెచ్చరిక నోటీసులు జారీ చేయించారు. వెంచర్లలో యంత్రాలు పెట్టి హద్దు రాళ్లను పీకించేశారు. దీంతో ఆయా వెంచర్లల్లో పాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఆందోళన చెందారు.
అక్కడ సీన్ కట్ చేస్తే..
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా కూడా సర్వే చేసిన నివేదిక బయటకు రాలేదు. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోలేదు. రిజిస్ట్రేషన్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్పు చేసి ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ప్లాట్లు మాత్రం చేతులు మారుతున్నాయి. కావలి నియోజకర్గంలో దాదాపు 130కు పైగా ఉన్న వెంచర్లలో కేవలం 5 వెంచర్లకు మాత్రమే నుడా అనుమతులున్నాయి. మిగిలినవి మాత్రం అప్రూవల్ లే అవుట్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
విభేదించిన బీద.. మౌనమేలా..
గతంలో కావలిలో స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వన్ మ్యాన్ షోగా నడిచింది. అధికార మార్పుతోనే ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వెంచర్లపై పడి తెగ ఆవేశ పడ్డాడు. అప్పట్లో ఆయన దూకుడు చూసి ప్రస్తుత ఎమ్మెల్సీ సైతం లోలోన రగిలిపోయారు. వెంచర్ల వ్యవహారంలో భారీగా చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పవర్ తగ్గడంతో బీద పెత్తనంలోనూ రియల్ డీల్స్‌పై మౌనం దాల్చడం వెనుక అంత్యర్యం ఏమిటాని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో
భారీగా లేఅవుట్ల ఏర్పాటు
కూటమి అధికారంలోకి రాగానే
వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కన్నెర్ర
ప్రభుత్వ భూముల్లో వేశారంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల హడావుడి
128 ఎకరాలను ఆక్రమించారంటూ ఆరోపణలు
రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పత్రికల్లో ప్రకటనలు
ఆ వెంటనే యంత్రాలు పెట్టి
పలు వెంచర్ల ధ్వంసం
ఆక్రమణలపై ఆగ్రహం..
పచ్చ కండువాతో శాంతం
యజమానులతో డీల్ కుదరడంతో మౌనం
కావలి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రియల్ వెంచర్లలో ప్రభుత్వ భూములు కలిపేసుకున్నారంటూ సర్వే నంబర్లతో సహా లీకులు ఇచ్చారు. కావలి బిట్–1లో సర్వే నంబరు 1834లో 5 ఎకరాలు, 487లో 2.67 ఎకరాలు, 551లో 2 ఎకరాలు, 832లో 2.61 ఎకరాలు, 546లో 4.02, 354లో 10.70 ఎకరాల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, బిట్–2లో 1855లో 15 ఎకరాలు, 1834లో 0.29, 1310లో 5.50, 1562లో 1.88, 1846లో 7.97, 1593లో 0.87 ఎకరాలు, 302లో 8.64 ఎకరాలు, కంచి రామగుంట, పులారుగుంటలో శ్మశాన స్థలం, కొనదిన్నె కాలనీలో 1.10 ఎకరాలు, అక్కిలగుంట పొరంబోకు భూములు ఆక్రమణలకు గురైనట్లు లీకులిచ్చేశారు. మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓలతో భూములు ఆక్రమణలు జరిగిందని ప్రకటనలు చేయించారు.
అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమం


