ఎగబాకుతున్న నిమ్మ ధరలు | - | Sakshi
Sakshi News home page

ఎగబాకుతున్న నిమ్మ ధరలు

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

బస్తా కాయలు రూ.పది వేలు

ఢిల్లీ మార్కెట్లో డిమాండ్‌

పొదలకూరు యార్డు నుంచి ఎగుమతులు

పొదలకూరు: తోటల్లో నిమ్మకాయల దిగుబడి తగ్గుతున్న సమయంలో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతో రైతుల పంటపండుతోంది. 100 బస్తాల కాయలుంటే, రూ.తొమ్మిది లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయమొచ్చే అవకాశం ఉంది. అయితే చాలా మంది రైతుల తోటల్లో కాయలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఎంత ధరలు ఉన్నా, ఇవి లేకపోవడంపై నిట్టూరుస్తున్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్‌ యార్డులో కిలో కాయలు రూ.100 నుంచి రూ.125 వరకు ప్రస్తుతం పలుకుతున్నాయి. నాణ్యత గల బస్తా రూ.పది వేల వరకు ఉంటోంది. దీంతో నాణ్యత ఉన్న కాయలను రెండు, మూడు బస్తాల్లో తీసుకొస్తున్న రైతులు రూ.20 నుంచి రూ.30 వేల వరకు తీసుకెళ్తున్నారు. వేసవి తాపం పెరుగుతున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల్లో నిమ్మకు డిమాండ్‌ పెరుగుతోంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ప్రస్తుతం దిగుబడి తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ఉన్న కాయలకు డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.

20 లారీల్లో ఎగుమతి

పొదలకూరు యార్డు నుంచి కాయలు తక్కువగా ఉన్నా, నిత్యం 20 లారీల్లో వివిధ ప్రాంతాలకు ఎగుమతవున్నాయి. నిత్యం 400 టన్నుల కాయలను ఢిల్లీ, వారణాశి, మదుర, లఖ్‌నవూ, గోరఖ్‌పూర్‌, చైన్నె, బెంగళూరు, కేరళ, బిహార్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఢిల్లీ మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయి రాష్ట్రంలోని ఏలూరు, తెనాలి మార్కెట్లు పెద్దవైనా, అక్కడి నుంచి ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో నిమ్మ తోటలున్నా, అక్కడ ప్రస్తుతం దిగుబడి లేదు. దీంతో పొదలకూరు పరిసర ప్రాంతాల్లోని వాటికి డిమాండ్‌ ఏర్పడింది. తోటల్లో పిందె కాయలు కోతకొచ్చేంత వరకు ధరలు పెరగడమే కానీ తగ్గడం ఉండదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ నెలంతా ధరలు ఆశాజనకంగానే ఉంటాయని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement