తేమల్లో, మొగ్గుల్లో
ఎంతైనా దోచుకో..
నిన్ను మేం అడగం..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని దళారులు, మిల్లర్లు దోచుకునే విధంగా కూటమి ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. ధరలు పతనమై పెట్టిన పెట్టుబడులు రాక కర్షకులు కన్నీరుమున్నీరవుతుంటే.. కనికరం లేని సర్కారు పెద్దలు ధాన్యం ధరలను రోజు రోజుకు పతనం చేస్తూ మిల్లర్లకు మద్దతుగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత విషాదకరం. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ (బీజీ)లు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారని 1:3 నిష్పత్తిలో బీజీలు తీసుకుని ధాన్యం సరఫరా చేయాలంటూ సాక్షాత్తు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో చెప్పడం బట్టి చూస్తే.. రైతులపై వీరికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో పుట్టి రూ.24 వేలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేఎన్‌ఎం రకం ధాన్యం పుట్టి రూ.24 వేల వరకు ధరలను స్థిరీకరించింది. ఇది అప్పట్లో కేంద్రం నిర్ణయించిన ఎంఎస్‌పీ కంటే రూ.5 వేలు అదనంగా ఉంది. ఇక షుగర్ లెస్ రకం అయితే అప్పట్లో పుట్టి కోతల సీజన్‌లో రూ.28 వేల వరకు కొనుగోలు చేసిన పరిస్థితి. ఎంఎస్‌పీ మించి రూ.9 వేల అదనపు ధర లభించింది. నిల్వ పెట్టిన ధాన్యం రూ.35 వేల నుంచి రూ.39 వేలు పలికింది. ఎంఎస్‌పీకి రెట్టింపు ధరగా చెప్పొచ్చు. జిల్లాలోని ప్రతి రైస్‌మిల్లరు పీపీసీల ద్వారానే ధాన్యం కొనాలే కండీషన్ పెట్టింది. పక్క జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి మిల్లర్లను ఆహ్వానించడంతో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జిల్లాలోని మిల్లర్లు కూడా అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయడంతో ధాన్యం ధరలు పెరగడానికి కారణమైంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. బోగస్
జిల్లాలో ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారానే కొంటామని ఒక పక్క ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, జిల్లా అధికారం యంత్రాంగం ఊదరగొడుతున్నారు. అయితే గతంతో పోల్చితే.. కొనుగోలు కేంద్రాలను గణనీయంగా తగ్గించేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 250పైగా కొనుగోలు కేంద్రాలు ఉంటే.. ఈ రబీ సీజన్‌లో 167 పీపీసీ (ధాన్యం కొనుగోలు కేంద్రాలు)లు అధికారులు ఏర్పాటు చేశారు. పీపీసీలకు ఏ రోజుకు ఆ రోజే ఇండెంట్ రిలీజ్ ఆర్డర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. రిలీజ్ ఆర్డర్ పూర్తయితే.. మరుసటి రోజు వరకు రిలీజ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో రైతులు ఈ తలనొప్పులు భరించలేక దళారులకు తెగనమ్ముకుంటున్నారు. అయితే ఈ పీపీసీల ద్వారా దిగుబడి అయిన ధాన్యంలో 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని తమకు ఆదేశాలు ఉన్నాయని ఇటీవల సివిల్ సప్లయ్స్ అధికారులు వెల్లడించడాన్ని బట్టి చూస్తే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. బోగస్ కేంద్రాలని స్పష్టమవుతోంది.
జిల్లాలో అధికారిక సాగు విస్తీర్ణం 7.7 లక్షల ఎకరాలు
అనధికారికంగా సాగు 1.5 లక్షల ఎకరాలు
ప్రతి ఎకరాకు సగటు దిగుబడి 3.5 పుట్లు (3 మెట్రిక్ టన్నులు)
జిల్లాలో సగటున వచ్చే దిగుబడి 27.37 లక్షల మెట్రిక్ టన్నులు
పీపీసీల ద్వారా కొనుగోలుకు అనుమతి 2 లక్షల మెట్రిక్ టన్నులు
7.3 శాతమే ప్రభుత్వం కొనుగోలు
జిల్లాలో ఐఏబీ సమావేశంలో అధికారికంగా 7.70 లక్షల ఎకరాలకు సాగునీటి కేటాయింపులు చేసింది. ఇదంతా అధికారిక ఆయకట్టు విస్తీర్ణమైతే.. అనధికారికంగా మరో 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. మొత్తంగా చూస్తే 9.20 లక్షల ఎకరాల్లో సగటు దిగుబడి (3.5 పుట్లు) లెక్కన సుమారుగా 27.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. అధికారుల లెక్కల ప్రకారం పీపీసీ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పడం బట్టి.. జిల్లాలో దిగుబడి అయిన ధాన్యంలో కేవలం 7.3 శాతమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టమవుతోంది. ఇందులో కూడా టీడీపీ నేతలైన పీఏసీఎస్ అధ్యక్షులు రైతుల పేరుతో విక్రయించినవే అధిక శాతం ఉందని సమాచారం. ఇక 92.7 శాతం ధాన్యాన్ని దళారులు, మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసి దోచుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం వరి కోతలు పూర్తి కాగా, మరో వారానికి కోతలు పూర్తి కానున్నాయి.
అలంకారప్రాయంగా
ధాన్యం కొనుగోలు కేంద్రాలు
దిగుబడి ధాన్యంలో 7.3 శాతాన్నే సేకరిస్తున్న ప్రభుత్వం
మిగతా 92.7 శాతాన్ని దళారుల ద్వారా మిల్లర్ల కొనుగోలు
పీపీసీలకు ఏ రోజుకు ఆ రోజే రిలీజ్ ఆర్డర్
సివిల్ సప్లయ్స్ శాఖ నుంచి అనుమతి ఉంటేనే ట్రక్ షీట్
జిల్లాలో ఇప్పటికే 70 శాతం
రబీ వరి కోతలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేఎన్‌ఎం పుట్టి రూ.24 వేలు, ఇప్పుడు రూ.17 వేలు
షుగర్ లెస్ అప్పట్లో పుట్టి రూ.35 వేల నుంచి రూ.39 వేలు
ఇప్పుడు రూ. 17 వేల నుంచి
రూ.18 వేల్లోపే
తేమ, తరుగు పేరుతో రైతుల నుంచి మరో రూ.రెండు వేల వరకు
దోచుకుంటున్న దళారులు, మిల్లర్లు
ఎంఎస్‌పీ ప్రకారం పుట్టి రూ.20,389 ఉంటే.. రూ.15 వేల నుంచి రూ.17 వేలకే కొంటున్న వైనం
జిల్లాలో ధాన్యం విక్రయాల్లో రైతులు గింజ గింజలోనూ దోపిడీకి గురవుతున్నారు. పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు. ఇక్కడ రైతుల పేరుతో టీడీపీ నేతలు, సొసైటీ అధ్యక్షులు, దళారులు, మిల్లర్లే నమోదు చేసుకుంటూ నిలువునా దోచుకుంటున్నారు. ఎంత ధాన్యం పండితే అంత కొనుగోలు చేస్తామంటూ సర్కారు పెద్దలు, మంత్రులు, అధికార యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పీపీసీల ద్వారా రోజుకు ఇంత ధాన్యమే కొనాలని టార్గెట్లు విధించడంతోపాటు ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు రిలీజ్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ రిలీజ్ ఆర్డర్ వస్తేనే ట్రక్ షీట్ ఇచ్చే పరిస్థితి పీపీసీల్లో నెలకొంది. సివిల్ సప్లయ్స్ శాఖాధికారులు చెప్పడం బట్టి చూస్తే.. కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రబీ సీజన్‌లో రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. జిల్లాలో సగటున దిగుబడి అయ్యే ధాన్యంలో 7 శాతం కూడా ప్రభుత్వం కొనడం లేదని స్పష్టమవుతోంది.
కూటమి అధికారంలోకి వచ్చిప్పటి నుంచి రైతులు దళారులు, మిల్లర్లకు తోడు టీడీపీ నేతల చేతిలో నిలువు దోపిడీకి గురవుతున్నారు. గడిచిన రెండు సీజన్లుగా ధరలు చూస్తే.. ఎంఎస్‌పీ ప్రకారం పుట్టి రూ.20,389 ఉంటే రూ.15 వేల నుంచి రూ.17 వేలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అత్యంత డిమాండ్ ఉన్న కేఎన్‌ఎం, జిలకర మసూరి రకాలను రూ.17 వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. ఇక షుగర్ లెస్ రకమైతే మరో రూ.వెయ్యి అదనం. దళారులతోపాటు టీడీపీ నేతలు రైతుల దగ్గర అతి తక్కువకు కొనుగోలు పీపీసీల ద్వారా ట్రక్ షీట్లకు అనుమతులు తీసుకుని మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ధరలు పరిస్థితి ఇలా ఉంటే.. ధాన్యం కొనుగోలులోనూ మరో దోపిడీ జరుగుతోంది. పుట్టి ధాన్యం 845 కేజీలకు తేమ, తరుగు పేరుతో 950 కేజీల నుంచి వెయ్యి కేజీల వరకు రైతులను సేకరిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి పుట్టికి మరో రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు దోపిడీకి గురవుతున్నారు.


