వెంకటాచలం: చికెన్ వ్యర్థాలతో వెళ్తున్న వాహనాన్ని గురువారం రాత్రి పట్టుకున్నారు. వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ క్రమంలో గూడూరు వైపు నుంచి నెల్లూరు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, చికెన్ వ్యర్థాలు ఉండటాన్ని కనుగొన్నారు. దీంతో వాహనాన్ని సీజ్ చేశారు. వెంకటాచలం సమీపంలోని అడవిలో గుంత తవ్వి వ్యర్థాలను మత్స్యశాఖ అధికారుల సమక్షంలో పూడ్చిపెట్టారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 62,642 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 23,887 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
గ్యాస్ ఏజెన్సీల
గోదాముల్లో తనిఖీలు
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని పలు గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన గోదాములను సివిల్ సప్లయ్స్ జిల్లా అధికారి లీలారాణి శుక్రవారం తనిఖీ చేశారు. ఏజెన్సీల వారు అధిక ధరలకు విక్రయించి.. డిమాండ్ సృష్టించిన అంశమై పలు ఫిర్యాదులు రావడంతో ఆమె పరిశీలించారు. నిల్వలు ఎంత మేర ఉన్నాయి.. బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తున్నారాననే అంశాలను ఆరాతీసిన అనంతరం ఆమె మాట్లాడారు. అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వినియోగదారులు సైతం అవసరమైనంత మేరకే బుక్ చేసుకోవాలని కోరారు. పట్టణంలోని సాయి గ్యాస్ ఏజెన్సీపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, పునరావృతమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామన్నారు. గూడూరు డీటీ చైతన్య పాల్గొన్నారు.
జడ్జి పరీక్షల్లో కావలి వాసికి తృతీయ ర్యాంక్
కావలి: జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో కావలికి చెందిన దరిశి వెంకటసత్య ధనూషా రాష్ట్రస్థాయిలో తృతీయ ర్యాంక్‌ను సాధించారు. పట్టణంలోని దరిశి వెంకటశ్యామ్ ప్రసాద్, వనజ కుమార్తె అయిన ఈమె ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంతో పాటు సీఏ, ఎంఏ జర్నలిజం విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయవాదిగా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమై జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభను చూపారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 46.190 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 350, లోలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నామని వెల్లడించారు.


