నెల్లూరు(పొగతోట): రాష్ట్రంలోని మహిళలకు తమ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేయనున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. మహిళలపై టీడీపీ ప్రభుత్వంలోని నేతలు వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడుతుంటే సీఎం చంద్రబాబు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దాష్టీకాలను ప్రశ్నించిన మహిళలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా.. బాధిత మహిళలను బెదిరించడం.. వేధింపులకు గురిచేయడం.. కేసులు పెట్టడం.. ఆపై వెనక్కి తీసుకునేలా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై సాక్ష్యాలతో సహా మహిళ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యల్లేవన్నారు. ఈమైపె పట్టపగలు ప్రజలు, పోలీసుల సమక్షంలో దాడి జరిగినా పట్టించుకునే స్థితిలో లేరని దుయ్యబట్టారు. విచారణ పూర్తయ్యేంత వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించినా, అదెక్కడా అమలు కావడంలేదని విమర్శించారు. వారి విధులను నిర్వర్తించాలనే ఆలోచనలో సైతం ఖాకీలు లేరని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారని పేర్కొన్నారు. నేరస్తులను తప్పించాలని చూస్తున్నారని, దీంతో నేరాలు మరింత పెరిగిపోతున్నాయని తెలిపారు. సత్తెనపల్లిలో మహిళా ఉద్యోగిపై దాడి చేశారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలు కరువైనా, కూటమి నేతలు సంబరాలు జరుపుకొంటున్నారని విమర్శించారు. మహిళల కోసం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన దిశ చట్టాలు, ఇతర సంస్కరణలను తీసేశారని ఆరోపించారు. జగనన్నకు మంచిపేరొస్తుందనే దురుద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉండేదని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను పొగిడేందుకే హోం మంత్రి పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. దాడులు, అఘాయిత్యాలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి శిక్ష పడేలా చూస్తామన్నారు.


