వెతలు తీరక.. కాళ్లరిగేలా తిరుగుతూ..!
నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ నామమాత్రంగా సాగుతోందనే భావన అర్జీదారుల్లో వ్యక్తమవుతోంది. ఇందులో వినతులను సమర్పించినా, అవి పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వారం దాదాపు 300 నుంచి 600 వరకు అర్జీలు అందుతున్నా, క్షేత్రస్థాయిలో పరిష్కారం తూతూమంత్రంగా ఉంటోంది.
లాగిన్ సైతం చేయని వైనం..
వాస్తవానికి నిబంధనల మేరకు అర్జీ అందిన 24 గంటల్లోపు సంబంధిత శాఖ అధికారి తన లాగిన్‌ను ఓపెన్ చేసి వీటిని పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఆఫీసర్లు దీన్ని అమలు చేయడంలేదని తెలుస్తోంది. ఓ అధికారి తన లాగిన్‌ను ఓపెన్ చేసి ఎన్ని రోజులైందో సైతం తెలియని పరిస్థితి. పశుసంవర్థక శాఖ, ఉదయగిరి, అనంతసాగరం తదితర మండల స్థాయి అధికారులు సైతం ఇదే బాటలో పయనిస్తున్నారు.
వామ్మో.. ఇన్నా..!
తాగునీరు, పారిశుధ్యం తదితర సమస్యలను మూడు రోజుల్లో.. రెవెన్యూ సంబంధితమైన వాటిని 90 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో 778కుపైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో సమస్యలు పరిష్కారం కాక అర్జీదారులు కలెక్టరేట్ చుట్టూ ప్రతి వారం తిరగాల్సి వస్తోంది. మరోవైపు 200 అర్జీల్లో 50 మాత్రమే పరిష్కారమవుతున్నాయని, మిగిలిన 150 మేర తరచూ వస్తున్నాయని సమాచారం. అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టరేట్లో అన్ని సదుపాయాలను కల్పిస్తున్నా, సమస్యల పరిష్కార విషయంలో మాత్రం చిత్తశుద్ధి కరువైందనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారులు ఇప్పటికై నా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పరిష్కారానికి నోచుకోని వైనం
అధికారుల్లో అంతులేని అలసత్వం
పెండింగ్‌లో భారీగా అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక తీరిదీ..


