సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు తగదు | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు తగదు

Feb 15 2026 6:48 AM | Updated on Feb 15 2026 6:48 AM

సచివా

సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు తగదు

నెల్లూరు(అర్బన్‌): సమయపాలన లేకుండా వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించేలా ఒత్తిడి చేస్తూ సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తగదని యునైటెడ్‌ వెల్ఫేర్‌ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ప్రభుత్వ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(యూడబ్ల్యూజీఈఏ) రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జల రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. పనిఒత్తిడితో బుడతవలస గ్రామ సర్వేయర్‌ రఘునాథ్‌ గుండెపోటుతో మరణించడం, అంతకు ముందు కొద్ది రోజులుగా రాష్ట్రంలో మరణించిన ఇతర సచివాలయాల ఉద్యోగుల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ముందుగా గాంధీబొమ్మ వద్ద బాపూజీకి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వీఆర్సీ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తామంతా ఉన్నతంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. తమతో శివరాత్రి పేరిట టాయిలెట్ల వద్ద విధులు నిర్వర్తించేలా చేయడం, వేకువజామున 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాపలా ఉండమనడం దారుణమన్నారు. తీవ్రమైన ఒత్తిడి పెంచిన నేపథ్యంలో అనేక మంది ఉద్యోగులు మృత్యువాత పడ్డారన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను ఆఫీస్‌ అవర్స్‌లోనే విధులు నిర్వర్తించేలా వెసులుబాటు కల్పించాలన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ లోకేశ్‌, నాయకులు మురళీకృష్ణ, గౌరీశంకర్‌, శ్రీనివాసులు, బాలు పాల్గొన్నారు.

దేవస్థానం భూమిని ఆక్రమించి

జామాయిల్‌ సాగు

బీజేపీ నేత నిర్వాకం

దుత్తలూరు: మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి సంబంధించిన భూమిని ఆక్రమించి జామాయిల్‌ నాటారని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పచ్చవ కరుణాకర్‌బాబు కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ బీజేపీ నాయకుడు మేకపాటి మాల్యాద్రి వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి సంబంధించి దొడ్డకొండ వద్ద ఉన్న కొంత భూమిని ఆక్రమించి అక్రమంగా జామాయిల్‌ సాగుచేయడంతో పాటు భక్తుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరును కూడా ఆక్రమించి కంచె వేశాడని తెలిపారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి భక్తుల మనోభావాలను కాపాడడంతో పాటు దేవస్థాన ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని కోరారు. దీనిపై తహసీల్దార్‌ నాగరాజును వివరణ కోరగా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆక్రమణ జరిగి ఉంటే రెవెన్యూ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామన్నారు.

సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు తగదు 1
1/1

సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు తగదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement