రోడ్డు బాగోలేదు.. మా బాధలు చూడండి
● విద్యార్థుల వినతి
చిల్లకూరు: గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని అన్నంబాక గ్రామానికి సరైన రోడ్డు బాగోలేదు. గత ప్రభుత్వంలో రోడ్డు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేసినా అటవీ ఆంక్షలు ఉండటంతో నిర్మాణం పూర్తి కాలేదు. అత్యవసర వేళల్లో అంబులెన్స్ వచ్చేందుకు కూడా ఇబ్బందిగా మారింది. ఇక్కడి విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరంలోని తిక్కవరం, కోట మండలంలోని చిట్టేడులో ఉన్న పాఠశాలల్లో చదువుకుంటున్నారు. రోజూ కుటుంబ సభ్యులు బైక్‌లపై తీసుకెళ్తుంటారు. వారికి ఏదైనా ఉంటే ఆరోజు విద్యార్థులు కష్టపడాల్సిందే. ఊర్లోకి ఆటోలు అంతంతమాత్రంగానే వస్తుంటాయి. దీంతో దారుణంగా ఉన్న రోడ్డుపై నడిచి వెళ్లి చదువుకుంటున్నారు. రహదారి బాగుంటే తమకు ఇంత కష్టం ఉండేది కాదని అధికారులు, పాలకులు దృష్టి సారించాలని కోరుతున్నారు.


